హైదరాబాద్ : వినాయక చవితి సమీపిస్తున్న క్రమంలో ఖైరతాబాద్ గణేశుడు విగ్రహ నిర్మాణానికి బుధవారం (మే 31న) అంకురార్పణ జరగనుంది. సాయంత్రం 5 గంటలకు మహాగణపతి కర్ర పూజ నిర్వహించనున్నారు. దీంతో గణనాథుడి విగ్రహ నిర్మాణం ప్రారంభంకానుంది.
వినాయక చవితి తెలంగాణలో ఘనంగా నిర్వహిస్తారు. గణేష్ చవితి అనగానే రాష్ట్ర ప్రజలకు గుర్తొచ్చేది హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేషుడే. ప్రతి ఏడాది భిన్నమైన రూపాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఆకట్టుకునే ఆ మహాగణపతి.. ఈ ఏడాది భక్తులను అనుగ్రహించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగా బుధవారం ఖైరతాబాద్ గణేష్ మండపం దగ్గర మహా గణనాథుడి విగ్రహ నిర్మాణ పనులు కర్ర పూజతో ప్రారంభించనున్నారు.
నిర్జల ఏకాదశి పురస్కరించుకుని ఖైరతాబాద్ మహాగణపతికి కర్రపూజ నిర్వహించనుంది గణేష్ ఉత్సవ కమిటీ. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి మట్టితో తయారు చేయనున్న విషయం తెలిసిందే.
గతేడాది మట్టితో తయారు చేసిన 50 అడుగుల ఎత్తైన శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతి విగ్రహాన్ని నిర్వాహకులు ప్రతిష్టించారు. ఇటీవలి కాలంలోనే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ సుదర్శన్ ముదిరాజ్ కన్నుమూసిన విషయం తెలిసిందే.
