ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఆదేశిస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయడం ..పోరాడటం తనకు కొత్త కాదన్నారు. ఎన్నికల్లో గెలవడం , ఫైట్ చేయడం తన రక్తంలోనే ఉందన్నారు. ఇప్పటి వరకు 11 సార్లు ఎన్నికల్లో పోటీ చేశానని చెప్పారు.
ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన ఎమ్మెల్యేల అనర్హత అంశం గురించి స్పందించారు. రాజీనామా ప్రస్తావన ఇంకా రాలేదని..సీఎం ఆదేశిస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయని..తన వాదనను వినిపిస్తానని తెలిపారు దానం. పదేళ్లు రేవంత్ సీఎంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి సజరుగుతుందన్నారు. హైదరాబాద్ లో గ్లోబల్ సమ్మిట్ ను ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోందన్నారు.
నాలుగు వారాల్లో తేల్చాలని
పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల అంశంలో నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. ‘‘ఈ విషయంలో అసెంబ్లీ స్పీకర్ (ట్రిబ్యునల్ చైర్మన్) చర్యలు తీసుకుంటారా? లేక కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కొంటారా? అనేది ఆయన ఇష్టం. ఫైనల్ గా కొత్త సంవత్సరం వేడుకల్ని స్పీకర్ ఎక్కడ జరుపుకుంటరో తనే నిర్ణయించుకోవాలి” అని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయి వ్యాఖ్యానించారు. ఈ కేసు విచారణ డిసెంబర్ 19న కోర్టు ముందుకు వచ్చే అవకాశం ఉంది.
10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్
పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ ను ఆదేశించాలని జనవరి 15న బీఆర్ఎస్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది . ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి,తెల్లం వెంకట్రావు,దానం నాగేందర్ పై పాడి కౌశిక్ రెడ్డి ,కేపీ వివేకానంద పిటిషన్ వేశారు. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారంశ్రీనివాస్ రెడ్డి, ఎం.సంజయ్ కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి అరికెపూడి గాంధీపై కేటీఆర్,హరీశ్ రావు రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
