ఖమ్మం టౌన్, వెలుగు : సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భూ సేకరణ కోసం అత్యధిక పరిహారం మంజూరు చేసి భూనిర్వాసితుల ఖాతాల్లో జమ చేశామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ లో సింగరేణి మండలం బాజు మల్లాయిగూడెం, రేలకాయలపల్లి గ్రామాలకు చెందిన భూనిర్వాసితులతో కలెక్టర్ చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి మండలం బాజు మల్లాయిగూడెం, రేలకాయపల్లి గ్రామాల్లో సీతారామ ఎత్తిపోతల పథకం 13వ ప్యాకేజీ నిర్మాణంలో భాగంగా భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. భూసర్వే చేసిన తర్వాత అవార్డులు ప్రకటించామని తెలిపారు. భూములు ఇచ్చేందుకు రైతులు అంగీకరించి అభివృద్ధికి సహకరించాలని కోరారు.
64 వేల మంది రైతులకు బోనస్ చెల్లింపు..
ఖరీఫ్ (2025-–26) సీజన్ కు సంబంధించి సన్న వడ్లకు రూ.500 బోనస్ రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం మద్దతు ధరతోపాటు సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లిస్తున్నట్లు తెలిపారు. సన్న వడ్లకు బోనస్ జిల్లాలో 64 వేల మందికిపైగా రైతులకు రూ.175.69 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు.
