- 99 రోజుల కార్యాచరణపై ఉమ్మడి
- ఖమ్మం జిల్లా సన్నాహక సమావేశం
ఖమ్మం, వెలుగు: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి విజయవంతం చేయాలని మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. రెవెన్యూ, అటవీ భూముల మధ్య సరిహద్దు సమస్యను రెండు శాఖల ఉన్నతాధికారులు జాయింట్ సర్వే చేసి పరిష్కరించాలని సూచించారు. శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి వాకిటి శ్రీహరి అధ్యక్షతన ఉమ్మడి ఖమ్మం జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా 99 రోజుల్లో చేపట్టే కార్యాచరణను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్లు అనుదీప్ దురిశెట్టి, అంకిత్ వివరించారు. అనంతరం ఇన్చార్జి మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ పేదల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు గడపగడపకూ చేరేలా అధికారులు కృషి చేయాలన్నారు. పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
క్రీడల కోసం అవసరమైన ఇన్ ఫ్రా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పిల్లలకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రతి వారం అందించే చికెన్ స్థానంలో చేపలు పెట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కోతులు, కుక్కల సమస్య పరిష్కారానికి వాటి సంతానోత్పత్తి నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ పేదలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు భవిష్యత్తు ప్రణాళిక సిద్ధం చేసుకునే ఉద్దేశంతో ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణ చేపట్టిందన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టల్స్ కు తహసీల్దార్ క్యాడర్ కు తగ్గకుండా ఒక అధికారిని ఇన్చార్జి గా నియమించాలని, వీరు అక్కడ భోజనం నాణ్యత పరిశీలించాలని, తప్పు జరిగితే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. గ్రౌండింగ్ కాని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఆసక్తి లేని పక్షంలో మరో లబ్ధిదారుడికి కేటాయించాలని ఆదేశించారు. మార్చి చివరి వరకు మొదటి విడత మంజూరు చేసిన ప్రతి ఇల్లు గ్రౌండ్ కావాలన్నారు.
99 రోజుల కార్యాచరణలో భాగంగా హెల్త్ సెక్టార్ పని తీరు మెరుగ్గా ఉండాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లోని యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించేందుకు అవసరమైన స్టాఫ్ అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా డ్రైయిన్ వల్ల ఇబ్బందులు ఎక్కడ ఉంటున్నాయో పరిశీలించి, అక్కడ అవసరమైన మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. ఈనెల 12న ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అవగాహన, శిక్షణ కార్యక్రమం ఉంటుందని చెప్పారు.
గ్రామ పంచాయతీలకు పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయని, ఆ నిధుల వినియోగంపై పర్యవేక్షించాలని సూచించారు. ఎకో పార్కుల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, పంట మార్పిడి, ఎరువుల, రసాయనాల వినియోగం, ఆధునిక సాగు పద్ధతుల అంశాలపై ప్రచారం కల్పించాలన్నారు. అనంతరం ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ, ముఖ్యమంత్రి సూచనల మేరకు ఉమ్మడి జిల్లాలో సన్నాహక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
3 ఏండ్ల డేటా పరిశీలించి జిల్లాలో 50 శాతంకు పైగా ప్రమాదాలు జరిగే 30 జంక్షన్లను గుర్తించి ప్రమాదాల నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టామని తెలిపారు. ఖమ్మం జిల్లాలో 10 వేల ఇందిరమ్మ ఇండ్లు 99 రోజుల కార్యాచరణలో భాగంగా పూర్తి చేసి గృహప్రవేశం చేసేలా కార్యాచరణ అమలు చేస్తున్నట్లు చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ప్రతి మండలానికి ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు.
30 రోజుల కంటే ఎక్కువ పెండింగ్ ఉన్న ఫైల్స్ 10 రోజులలో క్లియర్ చేయాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, జారే ఆదినారాయణ, మాలోతు రాందాస్ నాయక్, తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
సమన్వయంతో పని చేయాలి మహబూబాబాద్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశం
మహబూబాబాద్, వెలుగు: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు.
శుక్రవారం ప్రజాపాలన_ ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై మహబూబాబాద్ కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్ర నాయక్, ఎమ్మెల్సీ టి.రవీందర్ రావు, ఎమ్మెల్యేలు భూక్యా మురళీ నాయక్, దొంతి మాధవరెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనుగల వెంకట్రామిరెడ్డి, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు రాష్ట్ర ప్రభుత్వం “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల కొరతను తీర్చాలని, అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలని చెప్పారు.
పాఠశాలల వాహనాలు ఫిట్ నెస్ లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జీపీఆర్ఎస్ ద్వారా పాఠశాల వాహనాలు పర్యవేక్షణ చేయాలని కోరారు. స్లమ్ ఏరియాల్లో నివసిస్తున్న ప్రజలకు ఇందిరమ్మ గృహలు నిర్మించాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని, ఎక్కడైనా నిధులు మంజూరు సమస్య ఉంటే నివేదికలు పంపాలని తెలిపారు. ప్రతి హస్టల్ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించి తనిఖీలు చేయాలని, విద్యార్థులతో కలిసి భోజనాలు చేయాలని కోరారు. ఈ నెలాఖరు వరకు ఇందిరమ్మ ఇండ్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, గ్రౌండ్ కాని ఇండ్లు లబ్ధిదారుల నుంచి అంగీకారాన్ని తీసుకుని రద్దు చేయాలని తెలిపారు.
మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. దరఖాస్తుల స్థితిగతులను తెలుసుకునేలా ప్రత్యేక సాఫ్ట్ వేర్‌ను రూపొందించి, సమాచారం వారి సెల్‌ఫోన్లకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాలికల వసతి గృహాల్లో ఇన్వర్టర్లు ఏర్పాటు చేయాలని, మండల స్థాయిలో ఆరోగ్య సదస్సులు నిర్వహించి వైద్య పరీక్షలు చేపట్టాలని మంత్రి కోరారు. సమావేశంలో కలెక్టర్లు స్నేహ శబరీశ్, సత్యశారద, చాహత్‌బాజ్ పాయ్, సందీప్ కుమార్ ఝూ, రాహుల్ శర్మ, దివాకర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
