- పోటీకి సిద్ధమవుతున్న ఆశావాహులు
- రేపు మున్సిపాలిటీ ఓటర్ల తుది జాబితా రిలీజ్
- రిజర్వేషన్లపై ఇంకా రాని క్లారిటీ
- ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ ముఖ్యనేతలకు విన్నపాలు
ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్న నాయకులు రిజర్వేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఒకవైపు ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను అధికారులు స్పీడప్ చేస్తుండగా, కార్యకర్తలను సమాయత్తం చేయడంపై పార్టీలు దృష్టిపెట్టాయి. అదే సమయంలో ఈసారి ఎన్నికల బరిలో ఉండాలని భావిస్తున్న లీడర్లు మాత్రం రిజర్వేషన్ల ప్రకటన కోసం వెయిట్ చేస్తున్నారు. కొందరు వార్డు సభ్యులపై కన్నేయగా, మరికొందరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కుర్చీలపై నజర్ పెట్టారు. ఇప్పటి నుంచే ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రసన్నం చేసుకునేలా వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
పోటీ చేయాలనుకున్న వార్డులో రిజర్వేషన్కలిసి రాకపోతే సిద్ధంగా ఉండేలా ప్రత్యామ్నాయాన్ని కూడా వెతుక్కుంటున్నారు. అన్నీ అనుకూలిస్తే తనకు, మహిళా రిజర్వేషన్ వస్తే తన భార్యను పోటీలో నిలిపేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఆఫీసర్లు రిలీజ్ చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా ఆధారంగా తమ వార్డులో ఎవరికి రిజర్వ్ అయ్యే ఛాన్సుందంటూ ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో వచ్చిన రిజర్వేషన్లే మరోసారి వస్తాయా.. లేక రొటేషన్ పద్ధతిలో మారుస్తారా..? డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుతో ఆయా వార్డుల రిజర్వేషన్లలో మార్పులు వస్తాయా..? అని తెలిసిన అధికారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు.
ఎన్నికల కసరత్తులో అధికారులు బిజీ..!
ఖమ్మం జిల్లాలో మధిర, వైరా, సత్తుపల్లి, కల్లూరు, ఏదులాపురం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్, ఇల్లందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో ఎలక్షన్లకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారని ముందుగా చెప్పినా, 12న (రేపు) వాటిని విడుదల చేయనున్నారు. అయితే ప్రస్తుతం అధికారులు చెబుతున్న ప్రకారం ముసాయిదా ఓటర్ జాబితానే ఎన్నికలకు ప్రామాణికంగా మారనుందని తెలుస్తోంది. కొత్త ఓటర్లను చేర్చడం, చనిపోయిన వారి వివరాలను తొలగించడం వంటివి చేయడం లేదని, సవరణలకు అవకాశం లేదని ఆఫ్ ది రికార్డు చెబుతున్నారు. వార్డులవారీగా రూపొందించిన జాబితాలో ఒక వార్డు నుంచి మరో వార్డులోకి మారిన ఓటర్లను మాత్రమే మార్చే ఆస్కారముందని వివరిస్తున్నారు.
దీని ప్రకారం ముసాయిదా ఓటర్ల జాబితాలో అధికారులు ప్రకటించిన సంఖ్యలో మార్పులు ఉండే అవకాశం కనిపించడం లేదు. అయితే ఈనెల 12న ఫొటో గుర్తింపు కార్డుతో వార్డులవారీగా ఓటర్ల జాబితాను ప్రకటించాలని ఎన్నికల సంఘం ఆదేశించిందని అధికారులు చెబుతున్నారు. ఈనెల 13న ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాను విడుదల చేయనున్నారు.
మున్సిపాలిటీలు మహిళలు పురుషులు ఇతరులు మొత్తం
వైరా 12991 11696 02 24689
కల్లూరు 9785 9081 00 18866
మధిర 13424 12251 04 25679
సత్తుపల్లి 14970 13426 15 28411
ఏదులాపురం 23511 21742 03 45256
కొత్తగూడెం కార్పొరేషన్ 70503 64590 30 1,35,123
ఇల్లెందు 17523 16250 04 33777
అశ్వారావుపేట 8762 8084 04 16850
