ఖమ్మం టౌన్, వెలుగు : అటవీశాఖ ఖమ్మం డివిజన్ అధికారిగా సీహెచ్.కృష్ణ ప్రసాద్ మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ లో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు.
శివాలయం హుండీ ఆదాయం రూ.13.74 లక్షలు
కూసుమంచి, వెలుగు : ఈనెల 15న జరిగిన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కూసుమంచి మండల కేంద్రంలోని రామలింగేశ్వరస్వామి దేవస్థానానికి హుండీ ఆదాయం రూ.13,74 లక్షలు వచ్చిందని దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్రత్నప్రభ, ఈవో శ్రీకాంత్ తెలిపారు. మంగళవారం ఆలయ ఆవరణలో గ్రామపెద్దల సమక్షంలో హుండీ లెక్కించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షాపుల వేలం, అర్చన, ప్రత్యేక దర్శనం, ప్రత్యేక అభిషేకం, కళ్యాణ కట్నాలు, భక్తుల విరాళాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.13.74 లక్షలు అని తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈసారి రూ.1.44 లక్షల ఆదాయం అదనంగా వచ్చిందని వివరించారు. కార్యక్రమంలో అర్చకులు దేవులపల్లి శేషగిరిశర్మ, ఆలయ కమిటీ చైర్మన్ ప్రదీప్ రెడ్డి, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
మధిర శివాలయం హుండీ లెక్కింపు..
మధిర, వెలుగు : పట్టణంలోని మృత్యుంజయస్వామి ఆలయం(శివాలయం) శివరాత్రి హుండీ మంగళవారం అధికారుల సమక్షంలో సిబ్బంది లెక్కించారు. ఆలయ హుండీ ఆదాయం రూ.3,65,064 వచ్చినట్లు ఈవో జగన్మోహన్రావు తెలిపారు. ఇన్స్పెక్టర్ మమత, కాంగ్రెస్ నాయకుడు మాగం ప్రసాద్, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించడంలో ముందుండాలి
ఖమ్మం టౌన్, వెలుగు : ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కొత్తగా ఎన్నికైన మున్సిపల్ పాలకవర్గ సభ్యులు ముందుండాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్ సూచించారు. మంగళవారం ఖమ్మంలోని పార్టీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మం జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయం అందించిన ప్రతిఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకెళ్లాలని సభ్యులకు సూచించారు. సమావేశంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దీపక్ చౌదరి, మాజీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్యే కోటేశ్వరరావు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షుడు బొడ్డు బొందయ్య, నాయకులు సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, మొక్క శేఖర్ గౌడ్, నరాల నరేశ్ నాయుడు పాల్గొన్నారు.
అందరికీ అర్థమయ్యేలా పాఠాలు చెప్పాలి
ఖమ్మం టౌన్, వెలుగు : ప్రతి విద్యార్థి అర్థమయ్యేలా పాఠాలు చెప్పాలని అడిషనల్ కలెక్టర్ శ్రీజ టీచర్లకు సూచించారు. జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్యజైనీ అధ్యక్షతన మంగళవారం కలెక్టరేట్ లో జిల్లాలోని ఏడు మండలాలకు చెందిన విద్యాశాఖ అధికారులు, ప్రాథమిక పాఠశాల టీచర్లతో సమీక్ష నిర్వహించారు. ఎవ్రీ చైల్డ్ రైట్స్ ప్రగతిపై చర్చించారు. ఈ సందర్భంగా అధికారులు, టీచర్లకు పలు సూచనలు చేశారు. సమావేశంలో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ప్రభాకర్ రెడ్డి, అధికారులు హెచ్ఎం పాల్గొన్నారు.
రేపు జాబ్ మేళా
ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు రేపు జాబ్మేళా నిర్వహించున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి కొండపల్లి శ్రీరామ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పేటీఎం సేల్స్ అండ్ సర్వీస్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 10 గంటలకు ఖమ్మంలోని మోడల్ కెరీర్ సెంటర్ లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
పుస్తక పఠనం పట్లఆసక్తి పెంచుకోవాలి
టేకులపల్లి, వెలుగు : పుస్తక పఠనంపై యువత ఆసక్తి పెంచుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ పసుపులేటి వీరబాబు సూచించారు. మంగళవారం పుస్తక ప్రియుల పాదయాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరబాబు మాట్లాడుతూ గ్రంథాలయాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు. అనంతరం పుస్తక ప్రియులు చాగంటి కృష్ణమూర్తి మాట్లాడుతూ గ్రంథాలయంతో తనకు 50 ఏండ్ల అనుబంధం ఉందని, గ్రంథాలయాలు విద్యార్థులకు ఉన్నత స్థానాలకు చేరడానికి ఉపయోగపడుతాయని తెలిపారు. టేకులపల్లి లైబ్రరియన్ ఆర్.నాగన్న, గ్రావీటి స్కూల్ హెచ్ఎం బ్రహ్మచారి, టేకులపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం మోహన్, టీచర్లు, నాయకులు పాల్గొన్నారు.
