- ఇరాన్– ఇజ్రాయిల్ దాడులతో ఖానాపూర్‌కు చెందిన
- గల్ఫ్ కార్మికులు ఉక్కిరిబిక్కిరి
జన్నారం రూరల్, వెలుగు: ఇరాన్–ఇజ్రాయిల్ మధ్య దాడుల నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉన్న ఖానాపూర్ ప్రాంతానికి చెందిన కార్మికులు ఆందోళన చెందుతున్నారు. అక్కడి పరిస్థితులపై ఇక్కడ వారి కుటుంబ సభ్యులు భయబ్రాంతులకు గురవుతున్నారు. విమానాల రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోవడంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా దేశాల రాయబార కార్యాలయాలు కార్మికులను అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. అత్యవసర పరిస్థితుల్లో ఎంబసీని సంప్రదించాలని తెలియజేశాయి. ఖానాపూర్ నియోజకవర్గం పరిధిలో సుమారు 16 వేల మంది గల్ఫ్ దేశాల్లో పనిచేస్తుండగా, అందులో మంచిర్యాల జిల్లా జన్నారం మండలానికి చెందిన వారు దాదాపు 4 వేల మంది ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు వారంతా క్షేమంగానే ఉన్నట్లు గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కల్లెడ భూమన్న తెలిపారు.
పరిస్థితులను పర్యవేక్షిస్తున్నం: మంత్రి అడ్లూరి
ధర్మపురి(పెగడపల్లి): ఇరాన్‌లో ఉన్న భారతీయులు అధైర్యపడవద్దని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉపాధి కోసం జగిత్యాల జిల్లాకు చెందిన పలువురు ఇరాన్‌కు వలస వెళ్లారని చెప్పారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు గమనిస్తోందని వివరించారు. ఇరాన్‌లో ఉన్న భారతీయుల యోగక్షేమాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్లు మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర అధికారులు నిరంతరం సమాచారాన్ని సేకరిస్తున్నారని పేర్కొన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు.
ఇప్పటికైతే బాగానే ఉన్నాం
తాము ఇప్పటికైతే క్షేమంగానే ఉన్నామని దుబాయ్‌లోని అమెజాన్ సంస్థలో పనిచేస్తున్న జన్నారం మండలం కవ్వాల గ్రామానికి చెందిన పరకాల మహేశ్ తెలిపారు. బాంబుల శబ్ధాలతో కొంత భయం ఉన్నప్పటికీ రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉందని చెప్పారు. భయపడవద్దని కుటుంబ సభ్యులకు సూచించారు.
నాలుగు రోజులుగా రూంలోనే..
జన్నారం మండలానికి చెందిన జానే శ్రీనివాస్ జెరుసలేం ప్రాంతంలో బోనీ ఇబ్రహీం కన్‌స్ట్రక్షన్ కంపెనీలో కార్పెంటర్‌గా పనిచేస్తున్నారు. నాలుగు రోజులుగా బయటకు వెళ్లకుండా గదిలోనే ఉంటున్నామని, ఇంటివారు ధైర్యంగా ఉండాలని చెప్పారు. అక్కడి ప్రభుత్వం తగిన రక్షణ చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.
