
- ఖిలావరంగల్ తహసీల్దార్ నాగేశ్వరరావు ఇండ్లపై ఏసీబీ దాడులు
- గ్రేటర్ వరంగల్‍తో పాటు మరో ఏడు చోట్ల సోదాలు
- 17 ఎకరాల భూములు, 70 తులాల బంగారం, కార్లు, వాచీల స్వాధీనం
వరంగల్, వెలుగు : ఖిలా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరరావుకు చెందిన ఇండ్లపై శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. నాగేశ్వరరావుకు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడని ఆరోపణలు రావడంతో హనుమకొండ ప్రశాంత్‌నగర్‌లోని ఇల్లు, సొంత జిల్లా అయిన ఖమ్మంలోని ఇంటితో పాటు అతడి బంధువుల ఇండ్లు, ఆఫీసులు కలిపి మొత్తం ఏడు చోట్ల శుక్రవారం సోదాలు చేశారు. రూ.1.15 కోట్ల విలువైన ఇల్లు, రూ.1.42 కోట్ల విలువైన 17.10 ఎకరాల వ్యవసాయ భూములు, రూ.23.84 లక్షల విలువైన 70 తులాల బంగారంతో పాటు 1,791 గ్రాముల వెండి, రెండు కార్లు, బైక్, 23 వాచీలు, విలువైన గృహోపకరణాలు ఉన్నట్లు గుర్తించారు.
వీటి మొత్తం విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం.. రూ.5,02,25,198 ఉంటుందని అంచనా వేయగా.. మార్కెట్ రేటు ప్రకారం వీటి విలువ భారీ స్థాయిలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. కేసు విచారణ కొనసాగుతోందని.. పూర్తి అయిన తర్వాత మరిన్ని విషయాలు తెలుస్తాయని ఆఫీసర్లు తెలిపారు. దాడుల్లో ఏసీబీ డీఎస్పీ సాంబయ్య, ఇన్స్‌పెక్టర్లు ఎల్.రాజు, ఎస్.రాజు పాల్గొన్నారు.