టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి స్పీడ్ ఎక్కువైందని ట్రాఫిక్ పోలీసులు వెయ్యి రూపాయల జరిమానా విధించారు. రాంచీలో ధోనీ కారు ఓవర్ స్పీడ్ వెళ్లినందుకు మార్చి 1, 2026న డిజిటల్ ట్రాఫిక్ ఛలాన్ పడింది. ఐపీఎల్కు సన్నద్ధమవుతున్న ధోనీ ప్రీ సీజన్ ట్రైనింగ్లో చెన్నైలోనే ఉన్నాడు. ఒక చిన్న బ్రేక్ తీసుకుని మార్చిలోనే చెన్నై నుంచి తన హోం టౌన్ రాంచీకి వచ్చాడు. ఈ క్రమంలోనే.. రాంచీలో ధోనీ కారు ఓవర్ స్పీడ్ వెళ్తూ ట్రాఫిక్ పోలీసుల నిఘా కెమెరాలకు చిక్కింది. రాంచీలో ఆటోమేటిక్ ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్ (ATMS) అమలవుతున్న సంగతి తెలిసిందే.
ఈ విధానంలో 24/7 ప్రధాన కూడళ్లలో నిఘా నేత్రాలు ఓ కంట కనిపెడుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే.. ధోనీ మెర్సిడెస్ బెంజ్ కారు రాంచీలోని కంకే రింగ్ రోడ్డులో బిర్సా అగ్రికల్చర్ యూనివర్సిటీ దగ్గరలో 91 km/h వెళుతూ నిఘా నేత్రాల కంటపడింది. సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డ్ కావడం గమనార్హం. ఆ ప్రాంతంలో స్పీడ్ లిమిట్ 60 km/h. కానీ.. ధోనీ కారు 91 km/h వెళ్లడంతో మోటార్ హెహికల్స్ యాక్ట్ సెక్షన్ 183 కింద వెయ్యి రూపాయల జరిమానా విధించారు.
