నేలకొండపల్లి బౌద్ధ క్షేత్ర అభివృద్ధి పనులు ప్రారంభించాలి: ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేలకొండపల్లి బౌద్ధ క్షేత్ర అభివృద్ధి పనులు ప్రారంభించాలి: ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం టౌన్, వెలుగు  : నెల రోజుల్లో నేలకొండపల్లి బౌద్ధక్షేత్ర అభివృద్ధి కార్యచరణ ప్రారంభించాలని  ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. బౌద్ధ స్థూపం సందర్శన అనంతరం పురావస్తు శాఖ సంచాలకులు ప్రొఫెసర్ కె. అర్జున్ రావు కలెక్టరేట్ లో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బౌద్ధ క్షేత్రంలోని సంరక్షణ పనులు చేపట్టడానికి రూ.50 లక్షలను రాష్ట్ర పురావస్తు శాఖకు అప్పగించినట్లు తెలిపారు. 

అంతకుముందు రెవెన్యూ శాఖ మంత్రి ఆదేశాల మేరకు పురావస్తు శాఖ సంచాలకులు ప్రొఫెసర్ కె. అర్జున్ రావు నేలకొండపల్లి బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించడం జరిగిందని, ఈ సందర్శనలో భాగంగా బౌద్ధ క్షేత్రం వద్ద పురావస్తు శాఖ, పర్యాటక శాఖ చేపడుతున్న సంరక్షణ పనులను ముందుకు తీసుకుపోయేలా  బౌద్ధ క్షేత్రంలోని మాస్టర్ ప్లాన్లను ఆమోదం పొందటానికి క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు చెప్పారు. తనిఖీలోని బౌద్ధ క్షేత్రం మహా స్థూప విహారాలు, చైత్యాలు బయలు పడిన విధానాన్ని గమనించినట్లు తెలిపారు. 

ఈ తవ్వకాల్లో బయట పడిన వస్తువులను అన్నిటిని కూడా ఒక సైట్ మ్యూజియంగా ఈ బౌద్ధ క్షేత్రం దగ్గర ఏర్పాటు చేయాలని డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్ రావు ఆదేశించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప సంచాలకులు పి. నాగ రాజు, నర్సింగ్ సహాయ సంచాలకులు బుజ్జి, జిల్లా పర్యాటక శాఖ అధికారి సుమన్ చక్రవర్తి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.