
ఏపీలో వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టి మే 30 నాటికి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ఏడాది పాలనపై నిర్వహిస్తున్న సమీక్షల్లో కియా కంపెనీ ఒక శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టబోతున్నట్టు ప్రకటించింది. గురువారం నిర్వహించిన మన పాలన-మీ సూచన కార్యక్రమంలో భాగంగా పారిశ్రామిక రంగంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన సదస్సులో కియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అదనంగా మరో 54 మిలియన్ డాలర్లు (సుమారు రూ.410 కోట్లు) పెట్టుబడి పెడుతున్నట్టు ఆ కంపెనీ సీఈవో కూకున్ షిమ్ ప్రకటించారు. ఈ కొత్త పెట్టుబడుల ద్వారా ఏపీలో కియా ఎస్‌యూవీ వెహికల్స్ తయారీకి శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పారు. కరోనా వైరస్ ప్రభావం కంట్రోల్ లోకి వచ్చిన తర్వాత ఈ పనులు మొదలుపెడతామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కియాకు బలమైన బంధం ఉందని కూక్యూన్ తెలిపారు.
చంద్రబాబు దుష్ప్రచారం
అంతకు ముందు సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ఏపీలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నారు. సుదీర్ఘ సముద్ర తీరం ఏపీకి అతి పెద్ద సానుకూలత అని, రాష్ట్రంలో అన్ని రకాల వనరులు ఉన్నాయని చెప్పారు. ఏపీలో సుస్థిరమైన ప్రభుత్వం ఉందని, పరిశ్రమలకు భూమి, విద్యుత్ అందించడంతో పాటు పెట్టుబడులు పెట్టే వారికి ప్రోత్సాహకాలిస్తామని అన్నారు. కానీ గతంలో రాష్ట్రం నుంచి పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయని దుష్ప్రచారం జరిగిందని, అనంతపురంలో ఉన్న కియా పరిశ్రమ పక్క రాష్ట్రానికి తరలిపోతోందంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఎల్లోమీడియా అవాస్తవాలను ప్రచారం చేసినట్లు గుర్తు చేశారు. చివరికి కియా యాజమాన్యం ముందుకొచ్చి.. ఏపీ ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఉన్నాయని, తాము ఎక్కడికీ వెళ్లడం లేదని చెప్పిందన్నారు.