‘గాంధీ’లో  కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్

‘గాంధీ’లో  కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి డాక్టర్లు క్లిష్టమైన కిడ్నీ మార్పిడి సర్జరీని సక్సెస్​ చేశారు. ముషీరాబాద్ పరిధిలోని భోలక్‌పూర్‌కు చెందిన యువతి రెండేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. రెండు నెలల క్రితం గాంధీ దవాఖానకు వెళ్లగా నెఫ్రాలజీ డాక్టర్లు డయాలసిస్ సేవలందించారు. 

సమస్య శాశ్వత పరిష్కారం కోసం కిడ్నీ మార్పిడి ఒక్కటే మార్గమని నిర్ధారణకు వచ్చి, గత నెల 27న ఈ లైవ్ రిలేటెడ్ రీనల్ ట్రాన్స్​ప్లాంట్(కిడ్నీ మార్పిడి) శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఆపరేషషన్ చేసిన డాక్టర్లు మంజూష, శ్రీకాంత్, శ్రీనివాస్, రవి చందర్, రవి జాగీర్దార్, మురళీధర్, చంద్రావతి, నర్సింగ్ సిబ్బందిని సూపరింటెండెంట్ వాణి శనివారం అభినందించారు.

యువతికి అడ్రినల్ ​గ్లాండ్ ​సర్జరీ..

గాంధీ ఆస్పత్రి వైద్యులు అత్యంత సంక్లిష్టమైన అడ్రినల్ గ్లాండ్​ ఆపరేషన్​ను లాప్రోస్కోపిక్(కీహోల్) పద్ధతిలో విజయవంతంగా చేసి, ఓ యువతికి పునర్జన్మ ప్రసాదించారు. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలం చిత్యాలకు చెందిన లావణ్య రెండేళ్లుగా అధిక బీపీతో బాధపడుతోంది. బాధితురాలు గాంధీ ఆస్పత్రికి రాగా.. వైద్యులు పరీక్షలు చేసి, అడ్రినల్ గ్రంథిలో ఫియోక్రోమోసైటోమా అనే అరుదైన కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. 

అది శరీరంలో తీవ్ర ఒత్తిడి తెచ్చే హార్మోన్లను విడుదల చేయడం వల్ల బీపీ హఠాత్తుగా ప్రాణాంతక స్థాయికి పెరుగుతోందని తేల్చారు.  సర్జరీకి కొన్ని వారాల ముందు నుంచే ఆమె బీపీని ప్రత్యేకంగా నియంత్రిస్తూ వచ్చారు. తర్వాత యూరాలజీ డాక్టర్ రవిచందర్, ఎండోక్రైనాలజీ డాక్టర్ విజయ్ శేఖర్, అనస్థీషియా డాక్టర్ మురళీధర్, రేడియాలజీ డాక్టర్ శ్రీహరి ఆపరేషన్​ను సక్సెస్​చేశారు. వైద్యులను సూపరింటెండెంట్ వాణి  శనివారం అభినందించారు.