స్పీకర్‌‌‌‌ చాంబర్‌‌‌‌లో మహిళా ఎంపీల గొడవ..మరో వీడియో రిలీజ్ చేసిన కిరణ్ రిజిజు

స్పీకర్‌‌‌‌ చాంబర్‌‌‌‌లో మహిళా ఎంపీల గొడవ..మరో వీడియో రిలీజ్ చేసిన కిరణ్ రిజిజు

న్యూఢిల్లీ: పార్లమెంట్‌‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. కాంగ్రెస్‌‌ ఎంపీలు  లోక్‌‌సభ స్పీకర్‌‌ ఓం బిర్లా చాంబర్‌‌లోకి దూసుకెళ్లి.. ఆయనను దుర్భాషలాడారని కేంద్ర మంత్రి కిరణ్‌‌ రిజిజు ఆరోపించారు. ఈ నెల 4న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియోను  రిజిజు గురువారం ‘ఎక్స్‌‌’లో పోస్ట్‌‌ చేశారు. ఇందులో  స్పీకర్‌‌ ఓం బిర్లా చాంబర్‌‌ లోపల అనేకమంది ఎంపీలు ఉన్నారు. 

ఈ వీడియోను ఉటంకిస్తూ కాంగ్రెస్ ఎంపీలపై రిజిజు తీవ్ర ఆరోపణలు చేశారు. గత వారం లోక్‌‌సభ స్పీకర్ ఓం బిర్లా చాంబర్‌‌లోకి సుమారు 20-–25 మంది కాంగ్రెస్ మహిళా ఎంపీలు దూసుకెళ్లి, ఆయనను దూషించడమే కాకుండా ప్రధాని మోదీని కూడా బెదిరించేలా వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ‘‘ఇది ఒక కాంగ్రెస్‌‌ ఎంపీ చట్టవిరుద్ధంగా తీసిన వీడియో క్లిప్‌‌. 20–-25 మంది ఆ పార్టీ ఎంపీలు స్పీకర్‌‌ చాంబర్‌‌లోకి ఎంటర్‌‌‌‌ అయ్యారు. ఆయనను  తిట్టారు. ప్రధాని మోదీపై కూడా బెదిరింపు వ్యాఖ్యలు చేశారు” అని తెలిపారు.

మేం ఎవరినీ దూషించలే: ప్రియాంకా గాంధీ

కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చేసిన ఆరోపణలను కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ తీవ్రంగా ఖండించారు.  పార్లమెంట్‌‌ ఆవరణలో ఆమె మాట్లాడుతూ, తాము ఎవరినీ దూషించలేదని, కేవలం తమ నిరసనను శాంతియుతంగా తెలియజేశామని పేర్కొన్నారు. తాను ఎంపీలను వెనకుండి ప్రోత్సహించానన్న ఆరోపణ పచ్చి అబద్ధమని అన్నారు.  మాజీ ప్రధానులు జవహర్‌‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే తాము స్పీకర్ చాంబర్‌‌కు వెళ్లామని వివరించారు.