
- అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న 4 రాష్ట్రాలకు కొత్త ఇన్చార్జ్ల నియామకం
న్యూఢిల్లీ, వెలుగు: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నాలుగు రాష్ట్రాలు/ యూటీలకు బీజేపీ నేషనల్చీఫ్ జేపీ నడ్డా ఎన్నికల ఇన్చార్జ్లను నియమించారు. జమ్మూ– కాశ్మీర్ పార్టీ ఎలక్షన్ బాధ్యతలను కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి అప్పగించారు. ఈ మేరకు సోమవారం పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ ప్రకటన రిలీజ్ చేశారు. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ లో ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరుగనున్నాయి.
సెప్టెంబర్ లోగా జమ్మూ – కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలకు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ఆయా రాష్ట్రాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ తరఫున ఎలక్షన్ బాధ్యతలను కేంద్ర మంత్రులు, సీఎం, మాజీ సీఎంలకు అప్పగిస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇందులో మహారాష్ట్ర కు ఇన్చార్జ్, కో ఇన్చార్జ్ లుగా కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, అశ్వినీ వైష్ణవ్ ను నియమించింది.
హర్యానాకు ఇన్చార్జ్, కో ఇన్చార్జ్ లుగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మాజీ సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ ను, జార్ఖండ్ పార్టీ ఎన్నికల ఇన్చార్జ్గా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సహ ఇన్చార్జ్ గా అస్సాం సీఎం హేమంత్ బిశ్వ శర్మ ను నియమించారు. జమ్మూ – కాశ్మీర్ కు కేవలం ఇన్చార్జ్ ను మాత్రమే నియమించిన హైకమాండ్.. ఆ బాధ్యతను కిషన్ రెడ్డికి అప్పగించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని అరుణ్ సింగ్ పేర్కొన్నారు.