
- 50 శాతం ఇండ్లు పూర్తిచేయకుండానే చేశామంటున్నరు
- సుష్మా లేఖకు కట్టుబడే మేం కులగణన చేస్తున్నం
- రాహుల్, రేవంత్ రెడ్డికి భయపడి కాదు
- -మా కులగణనలో ముస్లింలను బీసీల్లో చేర్చబోం
- మత ప్రాతిపదికన ఎవరినీ బీసీల్లో చేర్చే ప్రసక్తే లేదు
- రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా
- కాంగ్రెస్ ఓటమి ఖాయమని కామెంట్
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ కాంగ్రెస్సర్కారు చేసింది బీసీ వ్యతిరేక సర్వే అని, అది రాంగ్ మోడల్అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. అది కులగణన కాదని, కులాలకు సంబంధించిన సర్వే అని పేర్కొన్నారు. 50 శాతం ఇండ్లు పూర్తిచేయకుండానే వాళ్లు కులగణన చేశామని చెప్పు కుంటున్నారని ఎద్దేవా చేశారు. గతంలో సుష్మా స్వరాజ్ ఇచ్చిన లేఖ ఆధారంగా తాము కులగణన చేపడుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి భయపడి ఈ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ‘‘ఎడ్ల బండి కింద ఉన్న కుక్క.. మొత్తం బండిని తానే మోస్తున్నానని అనుకుంటుంది’ అన్నట్లు కాంగ్రెస్ పార్టీ కూడా తాము చెప్పినట్లే కేంద్ర ప్రభుత్వం నడుస్తుందని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
కేంద్రం చేపట్టబోయే కులగణనలో.. ఎట్టిపరిస్థితుల్లోనూ ముస్లింలను బీసీల్లో చేర్చబోమని తెలిపారు. మత ప్రాతిపదికన ఎవరినీ బీసీల్లో చేర్చే ప్రసక్తే లేదని చెప్పారు. గురువారం కిషన్ రెడ్డి ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు మాత్రం ఆర్టికల్ 370 రద్దు, రామ జన్మభూమి, ట్రిపుల్ తలాక్, జీఎస్టీ వంటి ఏ నిర్ణయాన్ని అయినా.. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే తీసుకున్నదని వివరించారు.
రాజ్యాంగ విరుద్ధమన్న న్యాయస్థానాల తీర్పుకు వ్యతిరేకంగా బీసీ ముస్లింలు అనే ఆలోచనతో కాంగ్రెస్ ముందుకెళ్లిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ.. ఏం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా.. షార్ట్ టర్మ్ లక్ష్యాలతో, ఓటు బ్యాంకు రాజకీయాలు, అధికార దాహంతో తీసుకున్నవేనని విమర్శించారు. దేశ హితం కోసం, దేశ ప్రజల అభ్యున్నతి గురించి ఆలోచించలేదన్నారు. తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో చేపట్టిన కులగణన కూడా హడావుడిగా ఏదో సాధించామని చెప్పుకునే ప్రయత్నమే తప్ప.. ఇందులో చిత్తశుద్ధి లేదని అన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్కు బీసీలపై చిత్తశుద్ధి లేదు..
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏనాడూ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధితో పనిచేయలేదని కిషన్రెడ్డి అన్నారు. 46.25% బీసీ జనాభా ఉన్నప్పటికీ.. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను ఎందుకు ఇవ్వలేదని ఆ పార్టీ నేతల్ని ప్రశ్నించారు. కులగణన చేయాలంటే.. విధానపరమైన నిర్ణయాలు చాలా తీసు కోవాల్సి ఉంటుందని చెప్పారు. 50% జనాభాను కూడా చేరుకోకుండా మొత్తం సర్వే పూర్తి చేశామని కాంగ్రెస్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. శాస్త్రీయమైన పద్ధతిలో ఈ సర్వే జరగలేదని విమర్శించారు. బీసీ ముస్లింలను జోడించి చేసిన సర్వేను తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.
హైదరాబాద్లో 150 కార్పొరేషన్ సీట్లలో.. బీసీలకు రిజర్వ్ చేసిన 50 సీట్లలో.. 30 సీట్లు ముస్లింలే గెలిచారన్నారు. ‘‘బీసీల్లోని అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే.. నిష్పాక్షికమైన, సైంటిఫిక్ పద్ధతిలో కులగణన జరగాలనేదే మోదీ సర్కారు ఆలోచన. దీనికోసమే జనగణన వరకు వేచి చూశారు. జనగణన చేస్తున్నప్పుడే.. కులగణన సాధ్యమవుతుంది. పదేండ్ల బీజేపీ పాలనలో ప్రధాని మోదీ కులగణన ఎందుకు చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.
అయితే, 2010లో రేవంత్ ఏ పార్టీలో ఉన్నారో గుర్తు చేసుకోవాలి. బీజేపీ అధికారంలోకి వచ్చాక తొలిసారి జనగణన జరుగుతున్నప్పుడు.. కులగణన కూడా జరుగుతుంది” అని తెలిపారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కులగణను వ్యతిరేకించారని కిషన్రెడ్డి అన్నారు.
మేం సమగ్రంగా చేస్తం
కుల గణనలో తెలంగాణ సర్కారు అనుసరించిన రాంగ్ రోల్ మోడల్ తమకు అవసరం లేదని కిషన్ రెడ్డి అన్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లి.. సమగ్రంగా జనగణన చేస్తామని చెప్పారు. కులగణన చేపట్టేందుకు ‘సెన్సెస్ యాక్ట్ 1948’లో సవరణ తీసుకొచ్చి.. ఇందులో ‘కులం’ అనే పదాన్ని ఓ పారామీటర్ గా చేర్చాల్సి ఉంటుందన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన సవరణ తీసుకొచ్చాకే జనగణనపై ముందుకెళ్తామని స్పష్టత ఇచ్చారు.
2026లో జనగణన మొదలయ్యే అవకాశం ఉంటుందని, ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు కట్టుబడే కులగణన చేస్తామని చెప్పారు. తెలంగాణతో పాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ పార్టీ ఓటమి ఖాయమని కిషన్ రెడ్డి అన్నారు.