
- రాహుల్‌ది ఏ సామాజికవర్గమో కాంగ్రెస్ నేతలు చెప్తారా?
- కులగణన సర్వే పేరుతో బీసీల సంఖ్య తగ్గించారు
- ముస్లింలను కలపడంతో బీసీలకు 2 శాతం కోతపెట్టారు
- దేశవ్యాప్త కులగణనతో బీసీలకు న్యాయం చేస్తామని వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ నేతలు కుల రాజకీయం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ ని, ఆయన కులాన్ని కాంగ్రెస్ నాయకులు రాజకీయంగా మైలేజీ పొందేందుకు వాడుకుంటున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో తూతూమంత్రంగా కుల గణన చేశారని, ఈ సర్వేతో బీసీల సంఖ్యను తగ్గించారని పేర్కొన్నారు. కేంద్రంలోని తమ ప్రభుత్వం కుల గణన చేసి, రాజ్యాంగబద్ధంగా బీసీలకు న్యాయం చేస్తుందని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు చెప్పే 42 శాతం రిజర్వేషన్లతో బీసీలకు న్యాయం జరగదని, ఎంఐఎం పార్టీకి లబ్ధి చేకూర్చేందుకే ఈ రిజర్వేషన్లు తెచ్చారని ఆరోపించారు. మొత్తం 42 శాతంలో 10% ముస్లింలకు పోగా.. బీసీలకు దక్కేది 32 శాతమేనని చెప్పారు. అంటే ప్రస్తుతం బీసీలకు ఉన్న 34 శాతాన్ని మరో రెండు శాతం కాంగ్రెస్ తగ్గిస్తున్నదని విమర్శించారు.
శుక్రవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీసీల బిల్లు విషయంలో బీజేపీపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. మోదీ కన్వర్డెడ్ బీసీ అయితే.. మీ నేతది (రాహుల్‌గాంధీ) ఏ సామాజిక వర్గమో చెప్పాలన్నారు. దేశ ప్రధానిపై దిగజారిన వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని, ఆయన నామినేటెడ్ ప్రధాని కాదని, 3 సార్లు ఆయనపై నమ్మకంతో ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారని చెప్పారు. సీఎంగా ఉండి మిడిమిడి జ్ఞానంతో ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని రేవంత్‌రెడ్డి నుద్దేశించి అన్నారు. 1972లో లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చారని.. అంటే వారు కూడా కన్వర్టెడ్ ఎస్టీలా? అని ప్రశ్నించారు.
పెంచిన రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరగాలి
తెలంగాణ హైకోర్టు ఆదేశాల ప్రకారం.. పెంచిన రిజర్వేషన్లతోనే స్పష్టంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నదని కిషన్‌రెడ్డి అన్నారు. 42 శాతం రిజర్వేషన్లు అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఒవైసీ, అజారుద్దీన్, షబ్బీర్ అలీ లాంటి ముస్లింలకు కాకుండా.. పూర్తిగా బీసీలకే అందేలా, వారికే న్యాయం జరిగేలా కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలోమాదిరిగా 42 శాతం బీసీ రిజర్వేషన్ల పేరిట మళ్లీ ముస్లింలకే లబ్ధి చేకూర్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ‘‘తెలంగాణలో కాంగ్రెస్ పనికిరాని సర్వే చేసింది. 75 ఏండ్ల చరిత్రలో కాంగ్రెస్ ఏనాడూ బీసీ జనగణన చేయలేదు.
బీసీని ప్రధానిని చేసిన చరిత్ర బీజేపీది. దేశానికి అత్యధిక కాలం పని చేసిన రెండో ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. బీసీలను కాంగ్రెస్ మభ్య పెడుతున్నది. 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం అమలు చేయడంలో ఫెయిల్ అయింది. ముస్లింలను కలపడం వల్ల బీసీ వర్గాలకే అన్యాయం. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీసీ సీట్లలో ముస్లింలకు పోటీ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రతిపాదించిన 42 శాతం రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలకు ఇవ్వడం వల్ల నిజమైన బీసీలకు నష్టం జరుగుతుంది. వేరే వారికి నీతులు చెప్పే ముందు రేవంత్‌రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేసి, బీసీని ముఖ్యమంత్రిని చేయాలి” అని అన్నారు. మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి ముస్లింలకు బీసీ-‘ఈ’ పేరుతో 4 శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తుచేశారు. ఇలాంటి రిజర్వేషన్లు చెల్లవని హైకోర్టు రెండుసార్లు తీర్పునిచ్చినా..సుప్రీంకోర్టుకు వెళ్లి మరీ స్టే తెచ్చుకొని అమలు చేస్తున్నారన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఓడిపోవడం ఖాయమని చెప్పారు.