అరెస్ట్‌‌‌‌ లతో ప్రజాగ్రహాన్ని అణచలేరు : కిషన్ రెడ్డి 

అరెస్ట్‌‌‌‌ లతో ప్రజాగ్రహాన్ని అణచలేరు : కిషన్ రెడ్డి 
  • రాష్ట్రంలో నడుస్తోంది ప్రజా పాలనా.. పోలీసు పాలనా?: కిషన్ రెడ్డి 
  •     బీజేపీ నేతల అరెస్ట్‌‌‌‌పై కేంద్ర మంత్రి ఫైర్

న్యూఢిల్లీ, వెలుగు: అక్రమ నిర్భంధాలు, అరెస్ట్‌‌‌‌లతో ప్రజాగ్రహాన్ని అణచివేయలేరని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో అసెంబ్లీ’కార్యక్రమాన్ని అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ స్టేట్‌‌‌‌ చీఫ్ ఎన్‌‌‌‌.రాంచందర్‌‌‌‌ రావు సహా పలువురు సీనియర్‌‌‌‌ నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్‌‌‌‌ చేయడం కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వంలో నెలకొన్న అభద్రతా భావానికి అద్దం పడుతోందని సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.

ప్రజలను మోసం చేసేలా ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తే.. కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతోందని ప్రశ్నించారు. అసలు తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన నడుస్తోందా.. లేక పోలీస్‌‌‌‌ బలగాలతో పాలిస్తున్నారా.. అని నిలదీశారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ నేతలను అరెస్ట్‌‌‌‌ చేయడం అప్రజాస్వామికమని, పోలీసులను అడ్డుపెట్టుకొని పాలన సాగించాలనుకోవడం ప్రభుత్వం భ్రమ అని విమర్శించారు.