
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. అబద్ధాలు చెప్పడంలో ఎవరూ తీసిపోరని, అధికారం కోసం వారిద్దరూ ఎంతకైనా తెగిస్తారని ఆరోపించారు. కేసీఆర్ బాటలోనే సీఎం రేవంత్ నడుస్తున్నారని విమర్శించారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీస్లో మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు.
‘‘పచ్చకామెర్లు సోకిన రోగిలాగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం ఉంది. కాంగ్రెస్ మారుపేరు అవినీతి. ఇంటి పేరు అబద్ధాలు. వాటితోనే 75 ఏండ్లుగా రాజకీయం చేస్తున్నది. ఆరు గ్యారంటీలను 100 రోజుల్లోనే అమలు చేశామంటూ ఫ్లెక్సీల్లో అబద్ధాలు చెబుతున్నరు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ సీఎం అభద్రతాభావం, అసహనానికి గురవుతున్నారు. తాను చెప్పిందే ప్రజలు నమ్ముతారన్న భ్రమలో రేవంత్ ఉన్నారు. ప్రచారంలో ఆయన మాటలు సీఎం నిజస్వరూపాన్ని ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు. కేసీఆర్ ప్రమాదకారి అనుకుంటే.. కేసీఆర్ కన్నా రేవంత్ ఇంకా ప్రమాదకారిగా మారారని ప్రజలు అనుకుంటున్నారు’’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
పాక్కు అణిగిమణిగి ఉండాలంటున్నరు
భద్రతా దళాలను కాంగ్రెస్ నాయకులు ఏనాడూ నమ్మలేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. సర్జికల్ స్ట్రయిక్స్, ఎయిర్ స్ట్రయిక్స్కు ప్రూఫ్స్ ఏంటని సీఎం రేవంత్ ప్రశ్నిస్తున్నారని చెప్పారు. ‘‘సైనికుల శక్తిపై విశ్వాసం లేకుండా, వారి ఆత్మస్థైర్యం దెబ్బతినేలాగా కాంగ్రెస్ నాయకులు ఎన్నోసార్లు మాట్లాడారు. ‘పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయి. కాబట్టి ఆ దేశానికి అణిగిమణిగి ఉండాలి’ అని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడు అంటున్నాడు. పాక్కు అణిగిమణిగి ఉండడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు. కానీ, బీజేపీ అలా కాదు. పాక్ దాడులు, ఎత్తుగడలను తిప్పికొట్టి దాని నడ్డి విరిచింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్ని రోజులూ పాక్ ను అడ్డుకోలేకపోయింది. పాకిస్తాన్ వారు చంపేవాళ్లు. భారతీయులు చచ్చేవాళ్లు అనేలా వదిలేసింది” అని కిషన్ రెడ్డి విమర్శించారు.
రాష్ట్రానికి కేంద్రం సాయం చేసింది..
కేంద్ర ప్రభుత్వంతో కేసీఆర్ ఏనాడూ సత్సంబంధాలు పెట్టుకోలేదని కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం ఎన్నో రకాలుగా సహకారం అందించినా గత బీఆర్ఎస్ సర్కారు అందిపుచ్చుకోలేదని గుర్తుచేశారు. గతంలో ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు చెప్పారని, ఆ ప్రకటనలను మరచిపోయి గాడిదలతో గుడ్లు పెట్టించే స్థాయికి దిగజారారని విమర్శించారు.