కుటుంబ పాలన మీద యుద్ధం చెయ్: రేవంత్​పై కిషన్​ రెడ్డి ఫైర్

కుటుంబ పాలన మీద యుద్ధం చెయ్: రేవంత్​పై కిషన్​ రెడ్డి ఫైర్

హైదరాబాద్/ముషీరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీపై యుద్ధం చేస్తానని సీఎం రేవంత్  రెడ్డి అంటున్నారని, ఆయన యుద్ధం చేయాల్సింది కాంగ్రెస్  కుటుంబ పాలన మీద అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డి అన్నారు. కాంగ్రెస్  నేత సోనియా గాంధీకి ఆయన డబ్బు సంచులు మోస్తున్నారని కిషన్  ఆరోపించారు. కాంగ్రెస్​ పార్టీకి ఇప్పుడున్న 40 సీట్లు కూడా రావన్నారు. గురువారం హైదరాబాద్​లో ని ముషీరాబాద్​, సికింద్రాబాద్​ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్​ పాలనలో దేశంలో రోజూ ఉగ్రదాడులు జరిగేవని, హైదరాబాద్ లోని గోకుల్​చాట్, లుంబినీ పార్క్, దిల్​సుఖ్​నగర్​లో ఉగ్రదాడులు జరిగాయన్నారు. 

పాకిస్తాన్​ ఉగ్రవాదులను కాంగ్రెస్​ ప్రోత్సహించిందని విమర్శించారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక పాలన ప్రశాంతంగా సాగుతున్నదన్నారు. పాకిస్థాన్  టెర్రరిస్టులను మోదీ అణచివేశారని పేర్కొన్నారు. మన దేశాన్ని ప్రపంచ దేశాలు పొగిడేలా తయారు చేసిన వ్యక్తి మోదీ అని కొనియాడారు. కరోనా నియంత్రణలో మన దేశాన్ని ప్రపంచ దేశాలు తక్కువ చేసి చూసినా.. గట్టి సంకల్పంతో దేశాన్ని కరోనా నుంచి బయటపడేశారన్నారు. దేశంలో కరెంట్​ కోతలు లేకుండా చేశారన్నారు. 

బీఆర్​ఎస్​కు రేపు అనేది లేదు

బీఆర్ఎస్​ పార్టీకి రేపు అనేది లేదని కిషన్​ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్​ పూర్తిగా కనుమరుగు కావాలన్నారు. దోపిడీకి కాంగ్రెస్​ ప్రతిరూపమని, అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆ పార్టీ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలను బెదిరిస్తూ కాంగ్రెస్  నేత రాహుల్​ గాంధీ డబ్బులు  వసూలు చేస్తున్నారన్నారు. గ్యారంటీల పేరుతో కాంగ్రెస్​ సర్కారు గారడీ చేస్తున్నదన్నారు. వంటగ్యాస్​, ఫ్రీ కరెంట్​ పథకాన్ని కొంతమందికే ఇస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ లాగే కాంగ్రెస్​ కూడా అప్పులు చేయాలని చూస్తున్నదని, ఏ యాక్షన్​ ప్లాన్  కూడా ఆ పార్టీకి లేదని ఫైర్  అయ్యారు.