కేసీఆర్ తప్పుడు పాలన వల్లే.. సింగరేణి అప్పుల పాలు: కిషన్ రెడ్డి

కేసీఆర్ తప్పుడు పాలన వల్లే.. సింగరేణి అప్పుల పాలు: కిషన్ రెడ్డి

సింగరేణిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా ధ్వంసం చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సింగరేణిని కేసీఆర్ సర్కార్ పూర్తిగా నిర్వీర్యం చేసిందని... లాభాల్లో ఉన్న సింగరేణిని పూర్తిగా అప్పుల పాలు చేసిందని చెప్పారు. 2024, జూన్ 22వ తేదీ హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

బీఆర్ఎస్ పాలనలో ఏప్రిల్ 1, 2014 నాటికి సింగరేణి బ్యాంక్ అకౌంట్లలో రూ.3వేల 500 కోట్లు ఉండేవని కిషన్ రెడ్డి చెప్పారు.  2014కు ముందు సింగరేణి సంస్థ బ్యాంకులను డామినేట్ చేసేదని.. అధిక వడ్డీలు ఎవరిస్తారని బ్యాంకులకు ఆఫర్ ఇచ్చేదని తెలిపారు.2014కు ముందు ఏ ఒక్కసారి కూడా ఉద్యోగులకు జీతాలు కట్ చేయలేదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు రూ.30వేల కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు కిషన్ రెడ్డి. సింగరేణి చెల్లించాల్సిన బిల్లులు సకాలంలో చెల్లించలేని పరిస్థితి ఉందని.. కేసీఆర్ పాలనలో విద్యుత్ బకాయిలు సకాలంలో చెల్లించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. సింగరేణికి విద్యుత్ సరఫరా చేసే సంస్థలకు కూడా నిధులు సకాలంలో ఇవ్వలేదన్నారు. సబ్సిడీ బిల్లులు చెల్లించకపోవడం కారణంగా విద్యుత్ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని చెప్పారు. 6 శాతం వడ్డీతో చెల్లించాల్సిన బకాయిలను కూడా సింగరేణి చెల్లించలేదన్నారు.

కేసీఆర్.. సింగరేణి చేస్తున్న బొగ్గు సరఫరా బకాయిలు జన్కోకు సకాలంలో చెల్లించలేదని.. కేసీఆర్ తప్పుడు పాలన వల్లే సింగరేణికి అప్పు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో జరిగిన అధికార దుర్వినియోగం ఎప్పుడూ జరగలేదన్నారు. కేసీఆర్ ఏనాడు కార్మికులను కలిసిన పాపాన పోలేదని విమర్శించారు.2014కు ముందు సింగరేణిలో రాజకీయ జోక్యం లేకుండా ఉండేది కాదని.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక.. సర్పంచ్ నుంచి మంత్రుల వరకు సింగరేణిని దోచుకున్నారని ఆరోపించారు.  ఎంఎల్ఏలకు సింగరేణి ప్రోటోకాల్ ఉండాలని కేసీఆర్ సింగరేణిక చెప్పారని.. ఎంఎల్ఏలకు,  సింగరేణికి ఏంటీ సంబంధం అని ప్రశ్నించారు.

కేసీఆర్ ఆదేశాలతో ఇష్టారాజ్యంగా ఎంఎల్ఏలు, మంత్రులు సింగరేణిని ఉపయోగించుకున్నారని అన్నారు. ఒక కార్మికుడి షిఫ్ట్ చేంజ్ చేసుకోవాలన్నా.. స్థానిక ఎంఎల్ఏ పర్మిషన్ కావాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని ఫైరయ్యారు. కేసీఆర్ కుటుంబం సింగరేణిపై మొసలి కన్నీరు కారుస్తోందన్నారు. సింగరేణిని కేసీఆర్ ఏనాడు పట్టించుకోలేదని... కేవలం రాజకీయంగా మాత్రమే ఉపయోగించుకున్నారని ధ్వజమెత్తారు. కేంద్రాన్ని  ఏ విషయంలోనూ కేసీఆర్ సంప్రదించలేదని... సింగరేణి విషయంలో49శాతం వాటా ఉన్న కేంద్రాన్ని కేసీఆర్ ఎప్పుడూ సంప్రదించలేదని కిషన్ రెడ్డి విమర్శించారు.