అన్నా చెల్లెళ్లు చెప్పేవన్నీ అబద్దాలే : కిషన్ రెడ్డి

అన్నా చెల్లెళ్లు చెప్పేవన్నీ అబద్దాలే : కిషన్ రెడ్డి

నోరు తెరిస్తే అబద్దాలు.. నిజం మాట్లాడమే తెలియదు వాళ్లకు.. వాళ్లకు వాళ్లు గొప్పోళ్లుగా ఊహించుకుంటున్నారంటూ విరుచుకుపడ్డారు కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి. తెలంగాణ సమాజం మొత్తం తలదించుకునే పని చేసిన కవిత.. రాజకీయ వేధింపులు అని మాట్లాడటం సిగ్గు చేటన్నారు కిషన్ రెడ్డి. మార్చి 9వ తేదీ హైదరాబాద్ బీజేపీ పార్టీలో ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీ టార్గెట్ చేస్తున్నారని.. అన్నా చెల్లెళ్లు అంటున్నారని.. మోడీ టార్గెట్ చేసేంత గొప్ప కుటుంబం, మనుషులు అయితే కాదంటూ చురకలు అంటించారాయన. మీకు మీరుగా కేసులో ఇరుక్కుని బీజేపీపై అభాండాలు వేస్తున్నారని.. ఫోన్లు పగలగొట్టింది ఎవరు అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి. ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఎవరు తలదూర్చారు.. ఎవరు మార్చారు.. ఎవరు స్పెషల్ ఫ్లయిట్స్ లో వెళ్లారు.. ఎవరు డబ్బులు సంపాదించారు అంటూ ఏకిపారేశారు కిషన్ రెడ్డి.

మహిళా రిజర్వేషన్ల కోసం మాట్లాడే నైతిక హక్కు కల్వకుంట్ల కుటుంబానికి ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబానికి ఒక చట్టం, సామాన్యులకు ఒక చట్టం ఉంటుందా  అని ప్రశ్నించిన కిషన్ రెడ్డి.. మద్యం కేసు బయట పడగానే మహిళా రిజర్వేషన్లు గుర్తొచ్చాయా అని నిలదీశారు.  తెలంగాణలో ఐదేళ్లు మహిళా మంత్రి లేకుండా పాలించిన మీకు.. రిజర్వేషన్ల గురించి అడిగే హక్కు ఉందా అని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన పనికి తెలంగాణ ప్రజలు సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మీరు ఢీల్లీకి వెళ్లి అక్రమ మద్యం వ్యాపారం చేయాలని తెలంగాణ సమాజం చెప్పిందా అని ఆయన ప్రశ్నించారు.