
కాంగ్రెస్, బీఆర్ఎస్ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో బీజేపీకి ఒక్క అవకాశం ఇచ్చి మా పరిపాలన చూడాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీతోనే రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన సాధ్యమవుతుందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో అవినీతి, కుటుంబ రహిత పాలన అందిస్తామని అన్నారు.
బీసీ సీఎం నినాదంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్తామని.. ప్రజల్లో భాజాపాకు మంచి ఆదరణ ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ వస్తుందని.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ.. దేశం కోసం, సమాజం కోసం పనిచేసే పార్టీ అని అన్నారు. బీజేపీకి దేశం, ప్రజలే ముఖ్యమని.. ఆ తర్వాతనే కుటుంబమని అన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ లు ఒక్కటేనని.. ఆ రెండు పార్టీల డిఎన్ఏ కూడా ఒక్కటేనన్నారు. దీపావళి తర్వాత రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో మరింత జోష్ తో దూసుకుపోతాని ఆయన అన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, ఇతర రాష్ట్రాల సీఎంలు ప్రచారంలో పాల్గొంటారని... నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత బీజేపీ మేనిఫెస్టో విడుదల చేస్తామని చెప్పారు. అధికారం కోసం ఆర్థిక పరిస్థితలతో సంబంధం లేకుండా ఉచిత హామీలివ్వటం సరికాదని అన్నారు. విద్య, వైద్యం, ఉపాది అవకాశాలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలన్నారు. పార్టీల మేనిఫెస్టోలపై ప్రజలు ఆలోచనల చేయాలని.. ఏ పార్టీ ప్రజల కోసం చేస్తుందని భావిస్తారో ఆ పార్టీకి ఓటు వేసి గెలిపించుకోవాలని కిషన్ రెడ్డి అన్నారు.