ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతావ్: కిషన్ రెడ్డి

ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతావ్: కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కేసీఆర్.. ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్  రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్  కనుమరుగైందని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. సీనియర్లు పార్టీని వీడుతున్న బాధ కేసీఆర్‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తోందన్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి  మాట్లాడారు. 

బీఆర్ఎస్ ఓటమిని కేసీఆర్, కేటీఆర్  జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. పార్టీ నుంచి వలసలు, ఫోన్ ట్యాపింగ్  కేసు, కవిత అరెస్టుతో  బీఆర్ఎస్  సతమతమవుతోందని ఆయన తెలిపారు. బీజేపీని తొక్కాలని కేటీఆర్  అంటున్నారని, కామారెడ్డిలో తన తండ్రి కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను అక్కడి ప్రజలు తొక్కిన విషయం మరిచారా? అని ప్రశ్నించారు. అలాగే కాంగ్రెస్  పార్టీ పరిస్థితి కూడా అయోమయంగా మారిందన్నారు. గ్యారంటీల పేరుతో సీఎం రేవంత్  రెడ్డి గారడీ చేస్తున్నారని ఆరోపించారు. వంద రోజులు గడిచినా హామీలు అమలు చేయకుండా మాట మారుస్తున్నారని విమర్శించారు. కవిత అరెస్టుకు,  లోక్ సభ ఎన్నికలకు ఏమాత్రం సంబంధం లేదన్నారు. రాష్ట్రంలో డబుల్ డిజిట్ సీట్లను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 21,  22న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్  బన్సల్  రాష్ట్రంలో పర్యటిస్తారని  వెల్లడించారు.

బీజేపీలో చేరికలు

బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో, కిషన్ రెడ్డి సమక్షంలో ఉమ్మడి ఆదిలాబాద్  జిల్లా మాజీ జిల్లా పరిషత్  చైర్మన్ శోభ, నిర్మల్  పట్టణ కౌన్సిలర్లు నవీన్, అదుముల్ల రమా పద్మాకర్, ఏడిపెల్లి నరేందర్  తదితరులు బీజేపీలో చేరారు.