ప్రధాని మోదీ కులంపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు కరెక్ట్​ కాదు : కిషన్​రెడ్డి

ప్రధాని మోదీ కులంపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు కరెక్ట్​ కాదు : కిషన్​రెడ్డి
  • మోదీ క్యాస్ట్​ను 1994లోనే కాంగ్రెస్​ ప్రభుత్వం బీసీల్లో చేర్చింది
  • గుజరాత్​లోనే కాదు దేశమంతా బీసీలుగానే గుర్తించింది
  • ఈ విషయాన్ని సీఎం రేవంత్​ మరిచి మాట్లాడటమేంది?
  • సామాజిక న్యాయం గురించి కాంగ్రెస్​ నేతలా నీతులు చెప్పేది? 
  • ఒక్కసారైనా బీసీని సీఎం చేస్తమని ప్రకటించారా? అని నిలదీత

నల్గొండ, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ కులానికి సంబంధించి సీఎం రేవంత్ ​రెడ్డి వాస్తవాలను మరిచి వ్యాఖ్యలు చేశారని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్​ కిషన్​రెడ్డి మండిపడ్డారు. 1994లోనే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం మోదీ సామాజికవర్గాన్ని బీసీల్లో చేర్చిందని, ఒక్క గుజరాత్​లోనే కాకుండా జాతీయస్థాయిలో బీసీగా గుర్తించిందన్నారు. ఈ విషయం తెలుసుకోకుండా రేవంత్​ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని, సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడటం కరెక్ట్​ కాద ని ఆయన అన్నారు. రాష్ట్రంలోనూ 1970లో 93 కులాలు ఉంటే ప్రస్తుతం 113 కులాలున్నాయని, అనంతరామన్​ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చాలా కులాలను బీసీలో చేర్చారని తెలిపారు. కుల రాజకీ యాలను సీఎం  మానుకోవాలని ఆయన అన్నారు. శనివారం నల్గొండలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కిషన్​రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కులగణన సరిగ్గా జరగలేదని, ఈ విషయాన్ని బీసీ సంఘాలతోపాటు అన్ని వర్గాలు ప్రశ్నిస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలో 60 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కులగణన ఎందుకు చేయలేదని  ఆయన నిలదీశారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాకే  బీసీ కమిషన్​కు రాజ్యాంగ హోదా దక్కిందన్నారు. ‘‘సామాజిక న్యాయం గురించి కాంగ్రెస్​ నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్నేండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఒక్కసారైనా బీసీ సీఎంను చేస్తామని ప్రకటించిందా?” అని ప్రశ్నించారు. 

జాబ్​ క్యాలెండర్​ ఎక్కడ?

జాబ్​ క్యాలెండర్​ ప్రకటించి, రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ హామీ ఇచ్చిందని.. ఆ జాబ్  క్యాలెండర్​ ఎక్కడికి పోయిందని కిషన్​రెడ్డి ప్రశ్నించారు. డీఎస్సీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉందన్నారు. ‘‘ఆరు గ్యారంటీలు, 420 సబ్​ గ్యారంటీలు అమలు చేసే శక్తి, చిత్తశుద్ధి కాంగ్రెస్​కు లేదు. ప్రతి మండలంలో అంతర్జాతీయ స్థాయిలో స్కూలు ఏర్పాటు చేస్తామని, ఐదు లక్షల విద్యాభరోసా కార్డు ఇస్తామని, ఎడ్యుకేషన్​కు బడ్జెట్​ను రెండింతలు చేస్తామని కాంగ్రెస్​ నేతలు చెప్పారు. వాటి అమలు ఏమైంది?” అని నిలదీశారు. పాలమూరు, తెలంగాణ, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీల అప్​ గ్రేడ్​, ఆదిలాబాద్​, ఖమ్మంలో కొత్త విశ్వవిద్యాలయాల ఏర్పాటు, నిరుద్యోగులకు రూ.4వేల భృతి హామీలు ఏమయ్యాయని అడిగారు. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లకు పీఆర్సీ ఏర్పాటు చేయాలన్నారు. ఉద్యోగులకు రిటై ర్మెంట్​ బెనిఫిట్స్​ను ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్​మెంట్ రాక ఫీజుల కోసం కాలేజీలు స్టూడెంట్ల పేరెంట్స్​ మీద ఒత్తిడి తెస్తున్నాయని అన్నారు. విద్యాసంస్థలకు 8 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. గురుకులాల్లో ఆత్మహత్యలు పెరిగాయని, తినే తిండి విషపూరితం అవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. 

విద్యార్థినులకు ఇస్తామని చెప్పిన స్కూటీలు ఎక్కడని, రైతుల రుణమాఫీ, మహిళలకు రూ.2,500 ఏమయ్యాయని కిషన్​ రెడ్డి ప్రశ్నించారు. గ్రాడ్యుయేట్లు, టీచర్లు, నిరుద్యోగుల పక్షాన మాట్లాడాల్సిన బీఆర్​ఎస్ పార్టీ.. ఆ మాటనే ఎత్తడం లేదని విమర్శించారు. మండలి ప్రాధాన్యతను బీఆర్ఎస్​ పూర్తిగా తగ్గించిందన్నారు. ‘‘గతంలో ఎమ్మెల్సీలంటే గౌరవం ఉండేది. వారి మాటలకు ప్రభుత్వాలు విలువిచ్చేవి. మండలిలో టీచర్లు, నిరుద్యోగుల సమస్యలను లేవనెత్తుతాం. బీఆర్​ఎస్​ తీరును ఎండగట్టడంతోపాటు కాంగ్రెస్​ హామీలపై నిలదీస్తం. ఇప్పుడు జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేస్తున్న పార్టీ బీజేపీ ఒక్కటే.. సమస్యలపై పోరాడే చిత్తశుద్ధి ఉంది కాబట్టే పోటీలో ఉన్నాం” అని తెలిపారు. 

బీజేపీలో కొందరు అతి తెలివితో మాట్లాడ్తున్నరు

బీజేపీలో ఈ మధ్య కొంతమంది అతి తెలివితో మాట్లా డుతున్నారని, వాళ్ల గురించి పట్టించుకోవాల్సిన అవ సరం లేదని పరోక్షంగా ఎమ్మెల్యే రాజాసింగ్​ను ఉద్దేశించి కిషన్​ రెడ్డి అన్నారు. ఆయన వెంట కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తమ్ రెడ్డి, పార్టీ లీడర్లు గంగిడి మనోహర్ రెడ్డి, కాశం వెంకటేశ్వర్లు, మాదగోని శ్రీనివాస్ గౌడ్, నాగం వర్షిత్ రెడ్డి ఉన్నారు. 

నిధులపై చర్చకు రెడీ 

రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా నిధులు ఖర్చు చేస్తున్నదో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, కాంగ్రెస్​ ఇచ్చిన హామీల అమలుపై చర్చకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమా? అని కిషన్​రెడ్డి సవాల్​ చేశారు. ‘‘100 రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలు ఏమయ్యాయి?  ఏడాదిలో పూర్తి చేస్తామన్న అనేక ప్రాజెక్టుల్లో దెన్నీ పట్టించుకోకుండా మమ్మల్ని విమర్శించే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్​కు లేదు. రాష్ట్రంలో రూ. 26 వేల కోట్లతో రీజినల్ రింగ్ రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్​ చేసింది. జహీరాబాద్​లో ఇండస్ట్రీయల్​ కారిడార్​, వరంగల్​లో మెగాటెక్స్​ టైల్​పార్కు, కాజీపేటలో కోచ్​ ఫ్యాక్టరీ,  రామగుండంలో యూరియా ఫ్యాక్టరీ మంజూరు చేశాం.  2014 లో మిగులు బడ్జెట్​తో ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీయించిన ఘనత బీఆర్ఎస్, కాంగ్రెస్​ పార్టీలకే దక్కుతుంది” అని కిషన్​ రెడ్డి వ్యాఖ్యానించారు.