
- 42% రిజర్వేషన్లలో 10% ముస్లింలకు పోతే బీసీలకు మిగిలేది 32 శాతమే: కిషన్‌రెడ్డి
- బీసీల గొంతు కోసేందుకు రాహుల్, రేవంత్ ప్రయత్నం
- ఆ కుట్రలను బీసీ సమాజం తిప్పికొట్టాలని వ్యాఖ్య
- బీసీలకు రిజర్వేషన్ల పేరుతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు కేంద్రంపై నిందలు వేస్తరా?: రాంచందర్‌రావు
- బీసీ రిజర్వేషన్లపై ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా ధర్నా
హైదరాబాద్/ముషీరాబాద్, వెలుగు: కాంగ్రెస్ చెబుతున్న 42% రిజర్వేషన్లు బీసీలకు మేలు చేసేవి కావని, అవి మతపరంగా, ఓట్లపరంగా ముస్లింలకు మేలు చేసే రిజర్వేషన్లని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ చెప్తున్న 42 శాతం రిజర్వేషన్లలో10 శాతం ముస్లింలకు పోతే బీసీలకు మిగిలేది 32 శాతమేనని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో శనివారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఆర్.కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి, రెండేండ్లు గడిచినా బీసీలకు రాష్ట్ర సర్కారు చేసిందేమీ లేదని పేర్కొన్నారు.
‘‘నాడు ఒవైసీ చేతుల్లో కీలు బొమ్మగా ఉన్న కేసీఆర్ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కుట్ర చేశారు. కేసీఆర్ చేసిన పాపం వల్ల గతంలో 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23 శాతానికి పడిపోయాయి. ఇప్పుడు కాంగ్రెస్ చెప్తున్న 42 శాతంలోనూ బీసీలకు 10 శాతం పోతే మిగిలేది 32 శాతమే’’ అని పేర్కొన్నారు. మతపరమైన రిజర్వేషన్లతో బీసీల గొంతు కోసేందుకు రాహుల్, రేవంత్ ప్రయత్నిస్తున్నారని, ఆ కుట్రలను బీసీ సమాజం తిప్పికొట్టాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా 42% రిజర్వేషన్లు బీసీలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా దొడ్డిదారిలో మోసం చేసే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అసలు రాష్ట్రంలో కులగణన సమగ్రంగా జరగలేదని, హైదరాబాద్ సిటీలో 20 శాతం మందిని కూడా సర్వే చేయలేదన్నారు.
కేంద్రంపై నెపమెందుకు?: రాంచందర్‌రావు
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తానని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ పని చేయకుండా.. ఆ నెపాన్ని కేంద్రంపై మోపే ప్రయత్నం చేస్తున్నదని రాంచందర్‌రావు విమర్శించారు.అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బీసీ బిల్లులకు బీజేపీ బేషరతుగా మద్దతు తెలిపినప్పటికీ ఇంతవరకు ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కామారెడ్డి డిక్లరేషన్ విడుదల చేసినప్పుడు, దానిని అమలు చేయాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని అన్నారు. బీసీ రిజర్వేషన్ పేరుతో మతపరమైన రిజర్వేషన్లను తేవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ అన్నారు. దీనిని అడ్డుకుంటామని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.
బీసీ సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టిందో సీఎం రేవంత్లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు కాంగ్రెస్‌కు బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదని, హై కోర్టు చీవాట్లు పెట్టిన తర్వాతే బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తెచ్చిందని తెలిపారు.కాంగ్రెస్అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రకటించిన కాంగ్రెస్.. రెండేండ్లు గడిచినా ఎందుకు ఆ హామీని నెరవేర్చలేదని ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు. రిజర్వేషన్ల పేరుతో రేవంత్‌రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేండ్లపాటు బీసీలను మోసగిస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ అదే దారిలో నడుస్తున్నదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసేంత వరకు కాంగ్రెస్ సర్కారుపై బీజేపీ పోరాడుతుందని హెచ్చరించారు.
మోదీతోనే బీసీలకు సామాజిక న్యాయం
మోదీ ప్రభుత్వం దేశమంతా కుల గణన చేయబోతున్నదని కిషన్‌రెడ్డి తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక బీజేపీపై రేవంత్ సర్కారు నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నదని ఫైర్ అయ్యారు. సుదీర్ఘ కాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు బీసీనీ ప్రధానిని చేయలేకపోయిందని, ఎందుకు కులగణన చేపట్టలేదని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ మెప్పు కోసం రేవంత్ రెడ్డి ‘మోదీ కన్వర్టెడ్ బీసీ’ అంటూ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీకి కేసీఆర్‌కు మధ్య మంచి అవగాహన ఉందన్నారు. రాహుల్ గాంధీ కేసీఆర్‌ను ఎప్పుడూ విమర్శించరని చెప్పారు. రాష్ట్రంలో సీఎం మార్పు తప్ప ఎలాంటి మార్పు జరగలేదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లను ఎత్తివేసి, ఆ రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీలకు అందిస్తామని చెప్పారు. ఈడబ్ల్యూఎస్ కింద ఇప్పటికే ముస్లింలకు రిజర్వేషన్లు అందిస్తున్నామని ఆయన గుర్తుచేశారు. 42 శాతం రిజర్వేషన్ల కోసం బీసీ సమాజంతా ఐక్యంగా ఉద్యమించాలని, అందుకు బీజేపీ అండగా నిలుస్తుందని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు.