లిక్కర్​ మాఫియాకు బీఆర్ఎస్​ టికెట్లు: కిషన్​రెడ్డి

లిక్కర్​ మాఫియాకు బీఆర్ఎస్​ టికెట్లు: కిషన్​రెడ్డి
  • రాష్ట్ర ప్రజలు బీజేపీని ప్రత్యామ్నాయంగా చూస్తున్నరు
  • వెనుకబడిన ప్రాంతాల్లోనూ పార్టీకి ఆదరణ పెరుగుతున్నదని వ్యాఖ్య
  • బీజేపీలో చేరిన బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే రాథోడ్​ బాపురావు​​, కాంగ్రెస్​ నేతలు చల్లమల్ల కృష్ణారెడ్డి, సుభాష్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: బీఆర్​ఎస్​ పార్టీ అవినీతిని ప్రోత్సహిస్తున్నదని.. లిక్కర్ మాఫియాకు పాల్పడేవాళ్లకు, అవినీతిపరులకు టికెట్లు ఇచ్చిందని బీజేపీ స్టేట్​ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రజలంతా ప్రత్యామ్నాయంగా బీజేపీవైపే చూస్తున్నారని అన్నారు. బుధవారం ఢిల్లీలో కిషన్​రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ బోథ్​ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, మునుగోడు నియోజకవర్గానికి చెందిన నేత, పీసీసీ ప్రధాన కార్యదర్శి చల్లమల్ల కృష్ణారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్​ నేత సుభాష్ రెడ్డి, ఇతర నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న రాథోడ్ బాపురావు​ బీజేపీలో చేరడం గిరిజన ప్రాంతాల్లో, ఆదిలాబాద్ వంటి వెనుకబడిన ప్రాంతాల్లోనూ పార్టీకి పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమని అన్నారు. 

ఒకటోతేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రాన్ని కేసీఆర్​ నెట్టేశారని, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​కు ప్రజలే సరైన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ‘‘అటు కర్నాటకలో హామీల అమలులో వైఫల్యం చెందిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు తెలంగాణలో హామీల పేరుతో ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తున్నది” అని దుయ్యబట్టారు. 

బీఆర్​ఎస్​కు ప్రజలే బుద్ధిచెప్తరు: లక్ష్మణ్​

బీజేపీ వైపు నాయకులు, ప్రజలు ఆకర్షితులవుతున్నారని ఎంపీ లక్ష్మణ్  అన్నారు. బీఆర్ఎస్  పార్టీ డబ్బులు కుమ్మరిచ్చి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నదని, ప్రజలే సరైన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ‘‘అడవుల జిల్లా ఆదిలాబాద్ లో.. గిరిజన ఎమ్మెల్యేలను అవమానించేలా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తున్నది. రాథోడ్ బాపురావు వంటి సౌమ్యుడు, నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తికి కేసీఆర్ దర్బార్ లో గుర్తింపు దక్కడం లేదు. ఇది కల్వకుంట్ల కుటుంబ అహంకారానికి నిదర్శనం” అని మండిపడ్డారు. ప్రజలను ఆకర్షించే ఎన్నికల మేనిఫెస్టో కన్నా.. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించే మేనిఫెస్టోపైనే బీజేపీ దృష్టి సారిస్తుందని, త్వరలోనే  మేనిఫెస్టోను విడుదల చేస్తామని ఆయన అన్నారు. 

మేడిగడ్డ, అన్నారంపై కేసీఆర్​ ఎందుకు మాట్లాడ్తలే: సంజయ్​

జన వశీకరణ కోసం పూజలు చేయడమే కేసీఆర్​ ఆలోచన అని ఎంపీ  బండి సంజయ్ మండిపడ్డారు. ‘‘మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోతే కేసీఆర్​ ఎందుకు మాట్లాడ్తలే. అన్నారం బ్యారేజీకి కూడా పగుళ్లు ఏర్పడుతున్నట్లుగా వస్తున్న వార్తలతో.. ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీనిపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎందుకు మాట్లాడటం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వేలకోట్ల రూపాయల ఇసుక దందాలకు పాల్పడిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది” అని దుయ్యబట్టారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల సమయంలో పార్టీల్లోకి చేరికలు, జంపింగ్​లు సాధారణం. నీతి, నిబద్ధత కలిగిన బీజేపీపై ప్రజల్లో సానుకూల స్పందన ఉంది. ఎవరైనా బీజేపీలో చేరాలనుకుంటే.. రాజీనామా చేసిన తర్వాతే చేరాలన్న బీజేపీ నిబద్ధతను.. నీతి, నిజాయితీలను ప్రజలు స్వాగతిస్తరు” అని అన్నారు.

కేసీఆర్​ అపాయింట్​మెంట్​ కూడా ఇవ్వలేదు: రాథోడ్​ బాపురావు

ఉద్యోగాన్ని వదిలి తెలంగాణ ఉద్యమంలో చేరి, రాష్ట్ర సాధనకోసం తనవంతు ప్రయత్నం చేశానని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు​ అన్నారు. ‘‘రెండుసార్లు గెలిచిన నాకు  కొందరు కక్షగట్టి టికెట్ రాకుండా చేశారు. దీనిపై కలిసి మాట్లాడేందుకు ప్రయత్నిస్తే.. సీఎం కేసీఆర్​  అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు” అని మండిపడ్డారు. బోథ్​లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సోయం బాపురావు విజయానికి కృషిచేస్తానని అన్నారు.