మేం అధికారంలోకి రాగానే కాళేశ్వరంపై దర్యాప్తు జరిపిస్తం: కిషన్ రెడ్డి

మేం అధికారంలోకి రాగానే కాళేశ్వరంపై దర్యాప్తు  జరిపిస్తం: కిషన్ రెడ్డి
  • కాళేశ్వరంపై దర్యాప్తు జరిపిస్తం: కిషన్ రెడ్డి  
  • పిల్లర్లు కుంగిన ఘటనపై కేంద్రం సీరియస్ గా ఉంది 
  • సెంట్రల్ కమిటీ అడిగిన రిపోర్టులు రాష్ట్ర సర్కార్​ ఎందుకిస్తలే
  • ప్రపంచస్థాయి ప్రాజెక్టు అయితే వివరాలు ఎందుకు దాస్తున్నరు 
  • సమాచారం ఇవ్వకపోతే నేరంగా పరిగణిస్తామని హెచ్చరిక  
  • ఇయ్యాల మేడిగడ్డకు వెళ్లనున్న బీజేపీ స్టేట్ చీఫ్

హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్​గా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ‘‘రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణ లోపాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపిస్తం. దీనికి ముఖ్యమంత్రి, కాంట్రాక్టర్లు బాధ్యులని తేలితే తప్పకుండా చర్యలు తీసుకుంటం. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు” అని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్ సోమాజిగూడలోని కత్రియ హోటల్ లో బీజేపీ స్టేట్ ఎలక్షన్ మీడియా సెంటర్ ను పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్ చార్జ్ ప్రకాశ్ జవదేకర్ తో కలిసి కిషన్ రెడ్డి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లర్లు కుంగిన ఘటనకు సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘డిజైనింగ్ లోపాలు, నాసిరకం పనులతోనే పిల్లర్లు కుంగాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ రిపోర్టు ఇచ్చింది. దీనిపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు” అని ఫైర్ అయ్యారు. 

వివరాలు ఎందుకు దాస్తున్నరు?

పిల్లర్లు కుంగిన ఘటనపై కేంద్ర జలశక్తి మంత్రికి తాను లేఖ రాశానని కిషన్ రెడ్డి తెలిపారు. దీనిపై స్పందించిన కేంద్రం.. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసిందని చెప్పారు. ‘‘ఆ కమిటీ రిపోర్టు ఇచ్చింది. ప్లానింగ్, డిజైనింగ్, క్వాలిటీ సరిగా లేకనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని తెలిపింది. కుంగిన బ్లాకులోని పిల్లర్లు అన్నీ తిరిగి నిర్మించాలని, మిగతా బ్లాకుల్లోనూ లోపాలు ఉంటే... మొత్తం బ్యారేజీనే తిరిగి నిర్మించాలని చెప్పింది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డనే లైఫ్ లైన్. ఇప్పుడా బ్యారేజీకే ప్రమాదం పొంచి ఉంది” అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంజనీర్లు చెప్పినా వినకుండా, కేసీఆర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడంతోనే ఇలా జరిగిందని విమర్శించారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సెంట్రల్ కమిటీ 22 రిపోర్టులు అడిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం 11 రిపోర్టులే ఇచ్చింది. మిగతా అంశాలపై సమాచారం ఇవ్వడం లేదు. తమ దగ్గర సమాచారం కూడా లేదంటూ కమిటీకి రాష్ట్ర సర్కారు చెప్పడం దురదృష్టకరం. వెంటనే కమిటీ అడిగిన వివరాలు ఇవ్వాలి. లేదంటే దీన్ని తీవ్రమైన నేరంగా పరిగణించాల్సి ఉంటుంది” అని హెచ్చరించారు. ప్రాజెక్టుకు అయిన ఖర్చు, ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చారో కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం లేదని.. కాళేశ్వరం ప్రపంచ స్థాయి ప్రాజెక్టు అయినప్పుడు వివరాలు ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు.  

ఎకరానికి నీళ్లు ఇచ్చేందుకు రూ.85 వేల ఖర్చు.. 

కాళేశ్వరం గురించి ఆలోచిస్తేనే గుండె రగిలిపోతున్నదని కిషన్ రెడ్డి అన్నారు. ‘‘కాంగ్రెస్ హయాంలో రూ.30 వేల కోట్లతో చేపట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ రీ డిజైన్ చేశారు. వ్యయాన్ని రూ.1.30 లక్షల కోట్లకు పెంచారు. ప్రాజెక్టుతో ప్రజలు నష్టపోయారు. కేసీఆర్ కుటుంబం లాభపడింది. ప్రజల సంపదను కేసీఆర్ దోచుకున్నారు. కేవలం కమీషన్ల కోసమే ప్రాజెక్టు కట్టారు” అని ఆరోపించారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు మసకబారి, అది రాష్ట్రానికి  గుదిబండగా మారిందని అన్నారు. ఒక ఎకరం పంటతో రైతుకు వస్తున్న ఆదాయం రూ.40 వేలు అయితే, కాళేశ్వరం ద్వారా ఒక ఎకరా పంటకు నీళ్లు ఇవ్వడానికి రూ.85 వేలు ఖర్చవుతున్నదని చెప్పారు. ‘‘కాళేశ్వరం.. తన డ్రీమ్ ప్రాజెక్టు అని కేసీఆర్ చెప్పుకున్నారు. అలాంటి ప్రాజెక్టు కట్టిన నాలుగేండ్లకే కుంగింది. ఇదేనా కేసీఆర్ ఇంజనీరింగ్ గొప్పతనం” అని విమర్శించారు. కాగా, మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించేందుకు కిషన్ రెడ్డి శనివారం హెలికాప్టర్ లో అక్కడికి వెళ్లనున్నారు.

కూలిపోయే ప్రాజెక్టు కట్టిండు 

కామారెడ్డి, వెలుగు: రూ.లక్ష కోట్లు పోసి కూలిపోయే ప్రాజెక్టు కట్టిన కేసీఆర్​ను ఓడించాలని ప్రజలకు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆ అవకాశం కామారెడ్డి ప్రజలకు వచ్చిందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన బైక్ ర్యాలీ, బీజేపీ కార్యకర్తల మీటింగ్ లో కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. గజ్వేల్​లో ఓటమి తప్పదని తెలిసే, కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేస్తున్నారని అన్నారు. ప్రజల భవిష్యత్తు కామారెడ్డి ప్రజల చేతుల్లోనే ఉందని.. కేసీఆర్ ను ఓడించి, తెలంగాణను గెలిపించాలని కోరారు. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలపై చార్జ్ షీట్ తయారు చేస్తున్నామని, త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం వస్తే పార్టీ అభ్యర్థి వెంకట రమణరెడ్డిని మంత్రిని చేస్తామని హామీ ఇచ్చారు.