కొడుకును సీఎం చేయడంపైనే కేసీఆర్​ దృష్టి

కొడుకును సీఎం చేయడంపైనే కేసీఆర్​ దృష్టి
  • ఆయన తీరు వల్లే కృష్ణా ట్రిబ్యునల్ లేటైంది : కిషన్​రెడ్డి
  •     పంటల బీమాతోనే రైతులకు న్యాయం
  •     దేశంలో ఒక్క తెలంగాణలోనే ఈ పథకం అమలైతలె 
  •     మేం అధికారంలోకి రాగానే స్కీం అమలు చేస్తం
  •     ఎన్నికల్లో వేల కోట్లు ఖర్చుచేసేందుకు సిద్ధమైండని ఫైర్​ 
  •     చేపల పులుసు, పైసలకు కేసీఆర్​ అమ్ముడుపోయిండు: సంజయ్  
  •     నీరు లేకుంటే రైతు లేడు.. ఎవుసం ఉండదు: కేంద్ర మంత్రి కైలాస్ చౌదరి 
  •     నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బీజేపీ ఆధ్వర్యంలో రైతు సదస్సు 
  •     కృష్ణా జలాలపై వెదిరె శ్రీరాం పవర్ పాయింట్ ప్రజెంటేషన్

హైదరాబాద్, వెలుగు: రైతులకు పంటల బీమాతోనే న్యాయం జరుగుతుందని బీజేపీ రాష్ట్ర​అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో ఒక్క తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ పంటల బీమా అమలవుతోందన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోనూ ఈ స్కీం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ ఏర్పాటు చే యడం పట్ల ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెప్తూ కిషన్ రెడ్డి అధ్యక్షతన శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో రైతు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎనభై వేల పుస్తకాలు చదివిన మేధావి కేసీఆర్ వల్లే కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు ఆలస్యమైందన్నారు. కేసీఆర్ తన కొడుకు కేటీఆర్ ను సీఎంని చేయడం కోసం వచ్చే ఎన్నికల్లో వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యాడని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆయనకు కేటీఆర్ పై ఉన్న శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధిపై లేదన్నారు. బ్లాక్ మనీని వైట్ చేసుకోవడం కోసమే తాను ఎకరానికి రూ.కోటి సంపాదిస్తున్నానని చెప్తున్నాడని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం చేస్తున్న సాయాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని ఫైర్ అయ్యారు. ‘‘కేంద్రం అప్పులు ఇవ్వబట్టే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేశాడు. తెలంగాణలో 11 ప్రాజెక్టులు పూర్తిచేయడానికి మోదీ సర్కార్ నిధులిచ్చింది” అని చెప్పారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం కేసీఆర్ కు ఇష్టం లేదన్నారు. నదులను అనుసంధానం చేస్తే కాంట్రాక్టర్ల ద్వారా వస్తున్న వేల కోట్ల రూపాయల కమీషన్ కు గండిపడుతుందన్నదే ఆయన భయమని విమర్శించారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్, పేరు మార్చి ఆయన ఫాంహౌస్ ఇంజనీర్ అయ్యారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం కరెంట్ బిల్లులు, నిర్వహణ భారం ప్రజలపైనే పడుతోందన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్న ప్రధాని మోదీ సర్కారును ఆశీర్వదించాలని, తెలంగాణలోనూ రైతురాజ్యం తేవాలని కోరారు.   

నీరు లేకుంటే సేద్యం లేదు: కైలాస్ చౌదరి  

రైతులకు ప్రధాని మోదీ అండగా నిలుస్తున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాస్ చౌదరి అన్నారు. రైతు సదస్సులో ఆయన చీఫ్ గెస్ట్ గా మాట్లాడారు. రైతుల సమస్యలనే ముందుగా పరిష్కరించాలని మోదీ ఎప్పుడూ చెప్తుంటారని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం బడ్జెట్ ను ఆరింతలు పెంచిన ఘనత మోదీదేనన్నారు. సాగునీటిలో తెలంగాణ వాటాను దక్కించుకోవడంలో కేసీఆర్ సర్కార్ ఫెయిల్ అయిందన్నారు. నీరు లేకుంటే రైతు లేడు, వ్యవసాయం ఉండదన్నారు. 24 గంటల కరెంట్ పేరుతోనూ మోసం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమిపైనా కైలాస్ చౌదరి మండిపడ్డారు. గతంలో గాంధీ పేరును అడ్డం పెట్టుకుని దోచుకున్నారని.. ఇప్పుడు దేశం పేరుతో దోచుకోవాలని చూస్తున్నారన్నారు.  

కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం: వెదిరె శ్రీరాం   

రైతు సదస్సులో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘‘కృష్ణా జలాల కేటాయింపు విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం కూడా170 టీఎంసీల నీరు గ్రావిటీ మీద కోల్పోయింది. కృష్ణా జలాల పంపకంపై మహారాష్ట్ర, కర్నాటక, ఏపీ మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించేందుకు1974లో బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటైంది. ఉమ్మడి ఏపీలో 270 టీఎంసీలు కూడా వాడుకోలేని పరిస్థితులు ఎదురయ్యాయి. చివరకు నీళ్ల విషయంలో స్వరాష్ట్రంలోనూ న్యాయం జరగడం లేదు” అని ప్రజెంటేషన్ లో శ్రీరాం వివరించారు.  కృష్ణా పరివాహక ప్రాంతం 68.5 శాతం తెలంగాణలోనే ఉంది. కృష్ణా జలాల కేటాయింపులో తెలంగాణకు న్యాయమైన వాటా 570 టీఎంసీలు రావాల్సి ఉండగా, సీఎం కేసీఆర్ కేవలం 299 టీఎంసీలకే అంగీకరిస్తూ సంతకం చేశారు. భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులకు ఇంతవరకూ నికర జలాల కేటాయింపు జరగలేదు” అని ఆయన తెలియజేశారు. కేసీఆర్ సర్కార్ తీరుతో నల్లగొండ, పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. ఎస్ఎల్బీసీ నిర్మాణం కూడా ముందుకు పడలేదన్నారు. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ విధివిధానాలతోనూ తెలంగాణకు అన్యాయమే జరిగిందన్నారు. చివరకు కేంద్ర కేబినెట్ తెలంగాణకు కృష్ణా నీటి పంపకాలను నిర్ణయించేలా ట్రిబ్యునల్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిందన్నారు. కృష్ణా జలాల వాటా సమస్యలకు పరిష్కారం దొరికేలా ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుందన్నారు. సదస్సులో బీజేపీ నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, సాగునీటి రంగం మేధావులు, రిటైర్డు ఇంజనీర్లు, వివిధ జిల్లాల నుంచి రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

చేపల పులుసు కొంపముంచింది: సంజయ్ 

సీఎం కేసీఆర్ రాయలసీమకు పోయి తిన్న చేపల పులుసే తెలంగాణ ప్రజల కొంప ముంచిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. చేపల పులుసు కోసం, పైసల కోసం ఏపీకి అమ్ముడుపోయిండని ఫైర్ అయ్యారు. రైతు సదస్సులో సంజయ్ మాట్లాడుతూ.. కృష్ణా జలాల్లో తెలంగాణకు 575 టీఎంసీల నీరు రావాల్సి ఉంటే.. 299 టీఎంసీలకే ఒప్పుకుని ప్రజల నోట్లో మట్టి కొట్టిండని విమర్శించారు. పోలింగ్ రోజు చేపల పులుసును గుర్తుతెచ్చుకుని ఓటుతో కేసీఆర్ కు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోలు టెండర్ల పేరుతో రూ. 500 కోట్లు దోచుకున్నారని, ఆ డబ్బునే ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. వెంటనే ఆ టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కర్నాటక డబ్బుతో తెలంగాణ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని తాను ముందే చెప్పానన్నారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే దేశమంతా ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు తెలంగాణను ఆ పార్టీ ఏటీఎంగా వాడుకుంటుందన్నారు.