కేసీఆర్ ప్రగతిభవన్ లో ఉండేది.. 90 రోజులే!

కేసీఆర్ ప్రగతిభవన్ లో ఉండేది.. 90  రోజులే!
  •  ఆ తర్వాత పర్మినెంట్ గా ఫాంహౌస్ కు పంపుతం
  • 6 కాదు 60 గ్యారెంటీలు ఇచ్చినా కాంగ్రెస్ గెలవదు 
  • గెలిచిన ఎమ్మెల్యేలు అమ్ముడుపోరని గ్యారెంటీ ఏంటి..?
  • మంత్రులు, ఎమ్మెల్యేలు ఓడిపోతారని సర్వేలు చెప్తున్నయ్
  • ఆ రెండు పార్టీలకు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం
  • మోదీని విమర్శంచే హక్కు కేసీఆర్ కుటుంబానికి లేదు
  •  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఆరు కాదు అరవై గ్యారెంటీలు ఇచ్చినా గెలవదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార బీఆర్ఎస్ కు అమ్ముడు పోయారని, మళ్లీ ఆ పార్టీ నేతలను గెలిపిస్తే అమ్ముడు పోరని గ్యారెంటీ ఏమిటని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని చెప్పారు. బీజేపీని ఓడించేందుకు ఆ ర ఎండు పార్టీలు కుట్రలు పన్నుతున్నాయన్నారు. ఈ రెండు కుటుంబ పార్టీలకు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని చెప్పారు. కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉండేది ఇంకా 90 రోజులు మాత్రమేనని, ఆ తర్వాత ఆయనను పర్మినెంట్ గా ఫాంహౌజ్ కు పంపిస్తామని చెప్పారు. 

వేల కోట్లు దోపిడీ చేసిన కేసీఆర్ కు ఆయన కుటుంబానికి ప్రధాని మోదీని విమర్శించే హక్కు లేదన్నారు. ప్రధాని రాష్ట్రానికి వస్తుంటే సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో కూర్చొని కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర మంత్రులు, బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే లు ఓడిపోనున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయన్నారు. కేసీఆర్ కు చేతగాకుంటే ప్రగతి భవన్ లో కూర్చోవాలి తప్ప, మోదీపై అబద్ధాలు, తప్పుడు ప్రచారం చేయవద్దని హితవు పలికారు. ప్రజలంతా కేసీఆర్ హటావో...తెలంగాణ బచావో అంటున్నారన్నారు. ఆదివారం ప్రతి ఒక్కరూ ఉదయం 9 నుంచి 10 వరకు గంటపాటు స్వచ్చ భారత్ లో పాల్గొని, శ్రమదానం చేయాలని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.