2026 మార్చి 31 నాటికి నక్సలిజం ముగుస్తది: కిషన్ రెడ్డి

2026  మార్చి 31 నాటికి నక్సలిజం ముగుస్తది: కిషన్ రెడ్డి
  •  
  • నక్సల్స్ ప్రభావిత జిల్లాలు తగ్గినయ్: కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: పదేండ్ల కింద దేశంలో 125కు పైగా ఉన్న నక్సల్ ప్రభావిత జిల్లాలు.. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో 11కు తగ్గాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ 11 జిల్లాలు కూడా త్వరలోనే నక్సల్ రహిత జిల్లాలుగా మారుతాయని ఆశిద్దామని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన రిలీజ్ చేశారు. 

‘‘వందలాది మంది నక్సలైట్లు హింసను వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నరు. దీన్ని స్వాగతిస్తున్నాం. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజం హింస ముగుస్తది. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ లాంచ్ చేసింది. గడిచిన 3 రోజుల్లో 300 మందికి పైగా నక్సలైట్లు సరెండర్ అయ్యారు. వీరిలో ఎక్కువ మంది తెలుగువాళ్లే ఉన్నారు. ఇంతకాలం నక్సలిజం కారణంగా అనేక జిల్లాలు అభివృద్ధికి దూరంలో ఉండిపోయాయి. దేశమంతా దీపావళి వేడుకలు జరుపుకుంటున్న సమయంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు చీకటి నుంచి వెలుగు వైపు అడుగులు వేస్తుండటం చాలా సంతోషించాల్సిన విషయం. నక్సల్ రహిత జిల్లాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, యువతకు మెరుగైన ఉపాధి అవకాశాల కల్పనకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.