10కి పైగా ఎంపీ సీట్లు గెలుస్తం..90 రోజుల యాక్షన్ ప్లాన్: కిషన్ రెడ్డి

10కి పైగా ఎంపీ సీట్లు గెలుస్తం..90 రోజుల యాక్షన్ ప్లాన్: కిషన్ రెడ్డి
  • కేంద్రంలో మూడోసారీ గెలిచి హ్యాట్రిక్ కొడ్తం 
  • అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న రిజల్ట్ రాకున్నా.. ఓట్లు, సీట్లు పెరిగినయ్ 
  • 28న రాష్ట్రానికి అమిత్ షా వస్తారని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు:  రానున్న లోక్​సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 10కి పైగా ఎంపీ సీట్లు గెలుచుకుంటామని కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. లోక్​సభ ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా 90 రోజుల యాక్షన్ ప్లాన్ రూపొందించామని తెలిపారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో డబుల్ డిజిట్​లో ఎంపీ స్థానాలను గెలుచుకుంటామని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాము అనుకున్న ఫలితాలు రానప్పటికీ.. ఓట్ల శాతంతో పాటు సీట్లు పెరిగాయని చెప్పారు.

‘‘అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అన్ని జిల్లాలకు సంబంధించి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించి, లోక్​సభ ఎన్నికలకు పార్టీ క్యాడర్​ను సిద్ధం చేస్తాం. యువతను ప్రోత్సహిస్తూ ముందుకెళ్తాం. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు జనవరిలో కార్యాచరణ అమలు చేస్తాం” అని కిషన్ రెడ్డి తెలిపారు. 

28న పార్టీ మీటింగ్.. 

ఈ నెల 28న రాష్ట్ర పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. ‘‘ఈ నెల 22, 23 తేదీల్లో ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో జాతీయ పదాధికారులు, వివిధ రాష్ట్రాల అధ్యక్షులతో సమీక్షా సమావేశం జరిగింది. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించాం. ఈ నేపథ్యంలో ఎన్నికలకు క్యాడర్​ను సిద్ధం చేసేందుకు ఈ నెల 28న రాష్ట్ర పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించాం. దీనికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర, జాతీయ కార్యవర్గ సభ్యులు, ఇన్​చార్జులు, కన్వీనర్లు, మండలాధ్యక్షులు తదితరులు పాల్గొంటారు” అని చెప్పారు. 

మళ్లీ మేమే గెలుస్తం.. 

ప్రధాని మోదీ పాలనపై రాష్ట్ర ప్రజలు సానుకూలంగా ఉన్నారని కిషన్ రెడ్డి అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో మోదీకే మద్దతు ఇవ్వాలని దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ‘‘ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. లోక్ సభ ఎన్నికలకు సెమీ ఫైనల్ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. కానీ, ప్రజలు కాంగ్రెస్ మాటలు నమ్మలేదు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూలదోసి, బీజేపీకి పట్టం కట్టారు. అవినీతి, కుటుంబ జోక్యంలేని ప్రజా పాలన దేశంలో మరోసారి రాబోతున్నది. ఎవరూ ఊహించని విధంగా అద్భుతమైన మెజారిటీతో మోదీ ప్రభుత్వం హ్యాట్రిక్ విజయం సాధి స్తుంది” అని కిషన్​ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

రాముడి ప్రాణప్రతిష్టలో భాగమవ్వండి.. 

కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం దేశవ్యాప్తంగా ‘వీర్ బాల్ దివస్’ను నిర్వహించామని కిషన్ రెడ్డి చెప్పారు. పదో సిక్కు గురువు గురుగోవింద్ సింగ్ కుమారులైన బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్ చిన్నతనంలోనే ధర్మరక్షణ కోసం మొఘలులతో పోరాడి ప్రాణత్యాగం చేశారని.. ఆ చిన్నారుల త్యాగనిరతిని భావితరాలకు చాటిచెప్పేందుకు ‘వీర్ బాల్ దివస్’ను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ‘‘జనవరి 22న అయోధ్య రామమందిరంలో ప్రాణప్రతిష్ట మహోత్సవం జరగనుంది. ఇందులో బీజేపీ క్యాడర్, ప్రజలంతా భాగస్వాములు కావాలి. ఆ రోజు దేశంలోని ప్రతి ఆలయాన్ని అలంకరించాలి. దేవాలయాల ముందు స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని భక్తులు వీక్షించేలా ఏర్పాట్లు చేయాలి. ప్రతి హిందువు తమ ఇండ్లల్లో దీపాలు వెలిగించాలి” అని పిలుపునిచ్చారు. 

లోక్​సభ ఎన్నికలు మార్చిలోనే 

మార్చి చివర్లో లోక్ సభ ఎన్నికలు జరుగుతాయని కిషన్ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి చివర్లో షెడ్యూల్ వెలువడుతుందని పేర్కొన్నారు. మంగళవారం మీడియాతో కిషన్ రెడ్డి చిట్ చాట్ చేశారు. లోక్ సభ ఎన్నికల పర్యవేక్షణకు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో అగ్రనేత ఉంటారని,  తెలంగాణ ఇన్​చార్జ్ గా అమిత్ షా వ్యవహరిస్తారని చెప్పారు. ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల నుంచి ఎలాంటి దరఖాస్తులు తీసుకోబోమన్నారు. ‘‘అమిత్ షా ఈ నెల 28న మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. ఆ తర్వాత నేరుగా చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయానికి వెళ్లి పూజలు నిర్వహిస్తారు. అనంతరం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు” అని పేర్కొన్నారు.