ఒక్కో బూత్​లో 370 ఓట్లు టార్గెట్: కిషన్​రెడ్డి

ఒక్కో బూత్​లో 370 ఓట్లు టార్గెట్: కిషన్​రెడ్డి
  • బీజేపీ పదాధికారుల సమావేశంలో రాష్ట్ర ఇన్​చార్జి సునీల్​ బన్సల్ దిశానిర్దేశం
  • కొత్తవారిని పార్టీలోకి చేర్చుకోవాలని సూచన
  • వచ్చేనెల 6న టిఫిన్ బైఠక్​నిర్వహించాలని నిర్ణయం
  • ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటుతాం: కిషన్​రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రతి పోలింగ్ బూత్​లో బీజేపీకి 370 ఓట్లు సాధించడమే లక్ష్యంగా నేతలు, కార్యకర్తలు పనిచేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్​చార్జి సునీల్ బన్సల్ పిలుపునిచ్చారు. ఇంటింటికీ వెళ్లి, ప్రతి ఓటరును కనీసం మూడుసార్లు కలవాలని ఆదేశించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొత్తవారిని పార్టీలోకి చేర్చుకోవాలని సూచించారు. 

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ కన్వీనర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్​ చుగ్​, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే లక్ష్మణ్, బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బన్సల్​ మాట్లాడుతూ, రాష్ట్రంలో  బీజేపీ  అంటే మహిళలు సానుకూలంగా స్పందిస్తున్నారని, ఇటీవల జరిగిన రోడ్ షోకు చంకన పిల్లలతో హాజరయ్యారని గుర్తుచేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం ఏప్రిల్ 25న నామినేషన్లు ముగిసే వరకూ పార్టీ పటిష్టత కోసం పనిచేయాలని కోరారు.

పోలింగ్ బూత్ స్థాయిలో మోదీ సర్కారు ద్వారా లబ్ధిపొందిన వారిని కలవాలని, ముఖ్యంగా మహిళా సంఘాలను కలిసి వారి ద్వారా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 6న పోలింగ్ సెంటర్ల వారీగా టిఫిన్ సమావేశాలు (టిఫిన్​ బైఠక్​) నిర్వహించాలని కోరారు. నమో యాప్ ద్వారా చిన్న మొత్తం నిధులు (మైక్రో డొనేషన్స్ ) పొందేందుకు కృషి చేయాలని సూచించారు. వెంటనే పార్లమెంట్, అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల ఆఫీసులను ప్రారంభించాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ బూత్​ల బలాన్ని బట్టి ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తొలిసారి ఓటేస్తున్న యువతను ఆకర్షించేలా యువమోర్చా, రైతులను ఆకర్షించేలా కిషన్ మోర్చా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల్లోకి వెళ్లేందుకు ఆయా మోర్చాలు కృషి చేయాలని  పిలుపునిచ్చారు. 

ఎంపీ అభ్యర్థులతో వన్ టు వన్ మీటింగ్ 

ఎంపీ అభ్యర్థులతో బీజేపీ నేతలు సునీల్ బన్సల్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్​ తదితరులు వన్ టు వన్ మీటింగ్ నిర్వహించారు. ఇంటింటి ప్రచారం, సభలు, సమావేశాలు, ప్రచారం తదితర అంశాల్లో వెనకపడటంపై సునీల్​ బన్సల్​ అసంతృప్తి వ్యక్తంచేశారు. అందరికంటేముందు అభ్యర్థులను ప్రకటించినా ఎలాంటి ప్రోగ్రెస్​ లేదని అసహనం వ్యక్తం చేశారు. డిజిటల్​ వ్యాన్లు ఇచ్చినా.. ఎందుకు తిరగడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో 70 వేలకుపైగా  కుటుంబాలు కేంద్ర పథకాల ద్వారా లబ్ధిపొందాయని, వారి వివరాలు పంపి మూడు నెలలైనా ఎందుకు కలవలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంకా టైమ్ ఉన్నదని, ఇకనైనా ప్రచారాన్ని స్పీడప్​ చేయాలని ఆదేశించారు.

ఏప్రిల్​ 15న శ్రీరామ నవమి ఉన్నదని, ఎక్కడా జెండాలు ఎగురవేయొద్దని సూచించారు. ఆ పని ఆరెంజ్​ బ్రిగేడ్​ చేస్తుందని, వారికి మద్దతు ఇవ్వాలని సూచించారు. అంబేద్కర్​ జయంతిని ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన ఎంపీ అభ్యర్థుల తీరుపై  కేడర్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని  మిగతా అభ్యర్థులు వారికి దృష్టికి తీసుకుపోగా, కలిసి పనిచేసుకోవాలని నేతలు సూచించారు. 

ఇంటింటికీ ప్రచారానికి వెళ్తాం: మహేశ్వర్ రెడ్డి 

పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కోసం ఇంటింటికీ ప్రచారం చేపడ్తామని బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి తెలిపారు. పదాధికారుల సమావేశం అనంతరం ఆయన స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. కార్నర్ మీటింగ్​లకు  ప్రియారిటీ ఇస్తున్నామన్నారు. ప్రతి బూత్​లో పోలైన సగం ఓట్లు బీజేపీకి పడేలా కార్యచరణ తీసుకుంటున్నామని చెప్పారు. 

మేనేజ్​మెంట్​ కమిటీ సమావేశాలు నిర్వహించాలి: కిషన్​రెడ్డి

రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు తప్పుడు ప్రచారం చేసినా.. డబ్బులు ఖర్చు పెట్టినా.. బీజేపీకి డబుల్ డిజిట్ సీట్లు ఖాయమని కిషన్​రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రంలో 17 సీట్లు గెలిచి.. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే 6 గ్యారెంటీలు అమలు అవుతాయని రేవంత్ రెడ్డి అంటున్నారని, కానీ ఈ జన్మలో రాహుల్​గాంధీ ప్రధాని  కాలేడని ఎద్దేవా చేశారు.

ఈ ఎన్నికలు దేశానికి, దేశ భవిష్యత్ కు సంబంధించిన ఎన్నికలని, మన్మోహన్ సింగ్ పదేండ్ల పాలన.. మోదీ తొమ్మిదిన్నరేండ్ల పాలనను ప్రజలకు వివరించాలని సూచించారు.  ఈ నెల 29లోగా ప్రతి పార్లమెంట్ ఎన్నికల మేనేజ్​మెంట్​ కమిటీల సమావేశం పెట్టుకోవాలని, ఈ నెల 30 నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు అన్ని అసెంబ్లీ ఎన్నికల మేనేజ్​మెంట్​ కమిటీలు సమావేశం కావాలని నిర్ణయించారు.