
లోక్‌సభ రిజల్ట్స్ దెబ్బకు టీఆర్ఎస్ నేతలకు మతిమరపు వచ్చింది.
బీజేపీ ఎక్కడుందో.. నడ్డా ఎవరో తెలియదా?
దమ్ముంటే మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్
తెలంగాణలో బీజేపీ ఎక్కడుందని కేటీఆర్ అంటున్నారని, ఆ విషయం నిజామాబాద్‌లో ఓడిపోయిన కవితను అడిగితే తెలుస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. జేపీ నడ్డా ఎవరో తెలియదనడం కేటీఆర్ అహంకారపూరిత మాటలకు నిదర్శనమని మండిపడ్డారు. సారు, పదహారు, ఢిల్లీ సర్కారు అంటూ ప్రచారం చేసి, లోక్‌సభ ఎలక్షన్లలో దెబ్బతినడంతో టీఆర్‌ఎస్ నేతలకు మతిమరుపు వచ్చినట్టుందని కామెంట్ చేశారు. సనత్‌నగర్ ఈఎస్‌ఐ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం తర్వాత కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. నడ్డా ఎవరో తెలియదన్న కేటీఆర్ గతాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తోడ్పడిన సుష్మా స్వరాజ్ మరణిస్తే కేసీఆర్, కేటీఆర్‌లు కనీసం చూడటానికి వెళ్లలేదేమని నిలదీశారు.
దమ్ముంటే సమాధానమివ్వండి
బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా అడిగిన ప్రశ్నలకు టీఆర్‌ఎస్ నేతలు సమాధానం చెప్పగలరా అని కిషన్ రెడ్డి నిలదీశారు. ‘‘రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతుందా, లేదా సమాధానం చెప్పాలి. దళితుణ్ని సీఎం చేస్తానన్నారు. ఉద్యోగాలు కల్పిస్తామన్నారు, ఎన్నో చెప్పారు. అన్నీ ఏమయ్యాయి? దమ్ముంటే సమాధానమివ్వాలి..”అని సవాల్ చేశారు. గ్రామగ్రామాన యువత బీజేపీలో చేరుతున్నారని, రాష్ట్రంలో బలీయమైన శక్తిగా ఎదగడంపై దృష్టి పెట్టామని చెప్పారు. మున్సిపల్ ఎలక్షన్లలో పోటీ చేస్తామని, కానీ మున్సిపల్ ఎన్నికలే బీజేపీ లక్ష్యం కాదని తెలిపారు. బీజేపీ టార్గెట్ మిషన్ 2023 అని, రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీ బలోపేతంపై దృష్టి సారించామన్నారు. హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేస్తారని, కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చుతారని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రం వద్ద అలాంటి ఆలోచన గానీ, ప్రతిపాదన గానీ ఏమీ లేవన్నారు.s
ఆరోగ్యశ్రీ ఆందోళనలెందుకు?
ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ నేతలు తప్పుపట్టడం సరికాదని కిషన్‌రెడ్డి అన్నారు. ‘‘దేశవ్యాప్తంగా హాస్పిటళ్లకు ఆయుష్మాన్ భారత్‌లో పేమెంట్స్ బాగున్నాయి. ఏడాదికి రూ.5 లక్షల విలువైన వైద్యం అందుబాటులో ఉంటుంది. దేశంలో ఎక్కడైనా, ప్రైవేటు హాస్పిటళ్లలో కూడా ట్రీట్‌మెంట్ చేయించుకోవచ్చు. టీఆర్ఎస్ సర్కారు అనవసర పట్టింపులు, భేషజాలకు పోకుండా రాష్ట్ర ప్రజలకు ఈ పథకాన్ని అందుకునే అవకాశాన్ని కల్పించాలి. ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఆయుష్మాన్ భారత్ అమలు తీరును చూసి రావాలి.”అని సూచించారు. ఆరోగ్యశ్రీ మంచి కార్యక్రమమైతే హాస్పిటళ్ల వాళ్లు ఎందుకు ధర్నా చేస్తున్నారని కిషన్‌రెడ్డి నిలదీశారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకానికి రోజురోజుకూ తూట్లు పొడుస్తూ నిర్వీర్యం చేస్తున్నారని.. రెండు నెలలకోసారి హాస్పిటళ్లు ఆరోగ్యశ్రీ పేషంట్లను లోపలికి రాకుండా అడ్డుకుంటున్నాయని విమర్శించారు. రాష్ట్ర సర్కారు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయాలని, కావాలంటే కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవచ్చని సూచించారు.
సీఎం మాటలు పెద్ద జోక్: లక్ష్మణ్
పాలనలో తెలంగాణ స్ఫూర్తి ఇదేనా అని కలెక్టర్లు, అధికారులను సీఎం కేసీఆర్ ప్రశ్నించడం కన్నా జోక్ ఇంకోటి లేదని కె.లక్ష్మణ్ విమర్శించారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘తెలంగాణ కోసం ఉద్యమాలు, పోరాటాలు చేసిన విద్యార్థులను పక్కనపెట్టారు. ఆనాడు జై తెలంగాణ అన్నోళ్లను కేసుల పాలు చేసి కోర్టుల చుట్టు తిప్పుతున్నరు.. నై తెలంగాణ అన్నోళ్లను మంత్రులుగా తీసుకున్నారు. తెలంగాణను వ్యతిరేకించిన మజ్లిస్ పార్టీ నేతలు ఇప్పుడు నీకు మిత్రులాయే.. నాడు తెలంగాణ కోసం నీతో పనిచేసిన వాళ్లు శత్రువులాయే. ఇంక తెలంగాణ స్ఫూర్తి ఎలా ఉంటుంది..” అని లక్ష్మణ్ ప్రశ్నించారు. మొత్తానికి పాలనలో తెలంగాణ స్ఫూర్తి లేదన్న నిజాన్ని సీఎం ఒప్పుకున్నారన్నారు. కొత్త జిల్లాల లక్ష్యం నెరవేరలేదని కేసీఆర్ నిట్టూరుస్తున్నారని.. పేరుకు కొత్త జిల్లాలు, కొత్త మండలాలు తప్ప సిబ్బంది సంఖ్య ఏమైనా పెరిగిందా అని ప్రశ్నించారు. ఇన్నేండ్లు అవినీతి ఏమైంది?
అవినీతి రహితంగా తెలంగాణ ఉండాలంటూ కేసీఆర్ కొత్త నాటకాలకు తెర లేపుతున్నారని లక్ష్మణ్ విమర్శించారు. ‘‘గత ఐదేండ్లుగా రాష్ట్రాన్ని పాలించిందెవరు, మీరు కాదా? రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని అంటున్నారు, అంటే ఇన్ని రోజులుగా బీజేపీ చేసిన ఆరోపణలు నిజమని ఒప్పుకున్నందుకు చాలా సంతోషం” అని అన్నారు.