తెలంగాణకు ఎన్టీపీసీ పవర్ అక్కర్లేదా : కిషన్ రెడ్డి

తెలంగాణకు ఎన్టీపీసీ పవర్ అక్కర్లేదా : కిషన్ రెడ్డి
  • ఎన్నిసార్లు లేఖ రాసినా ప్రభుత్వం స్పందిస్తలేదు: కిషన్ రెడ్డి 
  • రిప్లై ఇవ్వకపోతే కరెంట్ ఇతర రాష్ట్రాలకు కేటాయిస్తామని వెల్లడి 

హైదరాబాద్/న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణకు ఎన్టీపీపీ పవర్ అవసరం లేదా? అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్టీపీసీ పవర్ పై రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు సార్లు లేఖ రాసినా స్పందించలేదని చెప్పారు. దీన్ని బట్టి రామగుండంలో కేంద్రం నిర్మించనున్న  సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు నుంచి విద్యుత్ కొనుగోలు చేసే ఆసక్తి తెలంగాణకు లేదన్నట్టుగానే భావించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి ఆసక్తి లేని పక్షంలో దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలకు కరెంట్ విక్రయిస్తామని తెలిపారు. ఈ మేరకు ఆదివారం కిషన్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో 2024 మార్చి నాటికి పీక్ పవర్ డిమాండ్ 15.6 గిగావాట్లకు పెరుగుతుందని అందులో పేర్కొన్నారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) అంచనా ప్రకారం.. 2030 నాటికి తెలంగాణలో పీక్ పవర్ డిమాండ్ ఇప్పుడున్న దానికి రెట్టింపు అవుతుందని చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పెరుగుతున్న పరిశ్రమలు, గృహ అవసరాలకు నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు రెండోదశ ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ (2,400 మెగావాట్లు)ను వీలైనంత త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘తెలంగాణలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ పై తొలి హక్కు రాష్ట్ర ప్రజలకే ఉంటుంది. ఈ విషయంలో కేంద్రం అన్ని రకాలుగా సహకరిస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వమే పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా ఎన్టీపీసీ రాస్తున్న లేఖలపై స్పందించి, పీపీఏ చేసుకుంటే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడినట్టు అవుతుంది. ఈ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని సానుకూల చర్యలు చేపట్టాలి” అని సూచించారు. 

ఒప్పందం చేసుకుంటేనే పని మొదలు.. 

పెద్దపల్లి జిల్లా రామగుండంలో సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేపట్టే ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా మొదటి విడతలో 800 మెగావాట్ల సామర్థ్యం గల రెండు ప్లాంట్లను ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రూ.10,598.98 కోట్లతో పూర్తి చేసింది.  మొదటి ప్లాంట్ ను గతేడాది అక్టోబర్ లో, రెండో ప్లాంట్‌‌ ‌‌  ను ఈ ఏడాది మార్చిలో ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ఈ రెండు ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అవుతున్న 1,600 మెగావాట్లలో 85 శాతం విద్యుత్ ను తెలంగాణ అవసరాలకే వినియోగిస్తున్నట్టు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక రెండో విడతలో భాగంగా మిగిలిన 2,400 మెగావాట్ల ప్రాజెక్టును కూడా వీలైనంత త్వరగా ప్రారంభిస్తామని చెప్పారు. ఇందుకోసం ఎన్టీపీసీతో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్  కొనుగోలు ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఆ తర్వాతే ప్లాంట్ల ఏర్పాటు, తగినంత బొగ్గు అందుబాటులో ఉంచుకోవడం తదితర అంశాలపై ఎన్టీపీసీ పని ప్రారంభిస్తుందని పేర్కొన్నారు. 

మను భాకర్​కు అభినందనలు 

పారిస్​ఒలింపిక్స్ లో భారత్ బోణీ కొట్టడంపై కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో కాంస్యం సాధించిన మను భాకర్ కు ఆయన అభినందనలు తెలిపారు. షూటింగ్ లో మెడల్ సాధించిన తొలి భారత మహిళగా మను భాకర్ రికార్డు సాధించారని ప్రశంసించారు. ఈ మెడల్ దేశానికి ఎంతో ప్రత్యేకమన్నారు.