నీట్​పై కిషన్ రెడ్డి స్పందించాలి

నీట్​పై కిషన్ రెడ్డి స్పందించాలి

బషీర్ బాగ్, వెలుగు: నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థులు భవితవ్యంపై నోరు మెదపని కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదని విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితి పేర్కొంది. నీట్ యూజీసీ పరీక్షా అంశంపై స్పందించాలని విద్యార్థి, యువజన సంఘాల నేతలు శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరినా పట్టించుకోలేదని సమితి నాయకులు మండిపడ్డారు. అందుకు నిరసనగా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన కిషన్ రెడ్డి ఇంటి ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. కాచిగూడలోని ఆయన ఇంటి ముట్టడికి యత్నించిన విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్‌‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. కిషన్ రెడ్డికి గనుల వేలం పాటపై ఉన్న శ్రద్ధ, లక్షల మంది విద్యార్థుల అంశంపై లేకపోవడం సిగ్గు చేటన్నారు. నీట్ పేపర్ లీకేజీ అంశంపై ప్రధాని మోదీ ఛాయ్ పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించేలా కిషన్ రెడ్డి ఆయనను అడగాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని, పరీక్ష నిర్వహణలో పారదర్శకత లేని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌‌టీఏ)ను రద్దు చేయాలని కోరారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే తమ పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ముట్టడిలో ఎన్‌‌ఎస్‌‌యూఐ, ఏఐఎస్‌‌ఎఫ్, ఎస్‌‌ఎఫ్‌‌ఐ, పీడీఎస్‌‌యూఎస్‌‌, ఏఐవైఎఫ్, డీవైఎఫ్‌‌ఐ, పీవైఎల్‌‌ఎం నాయకులు పాల్గొన్నారు.