కేసీఆర్‌‌పై విరక్తితో బీఆర్‌‌ఎస్‌ను ఓడించిన్రు: కిషన్‌ రెడ్డి

కేసీఆర్‌‌పై విరక్తితో బీఆర్‌‌ఎస్‌ను ఓడించిన్రు:  కిషన్‌ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్‌‌ పాలనపై విరక్తి చెందిన ప్రజలు బీఆర్‌‌ఎస్‌ ఓడించారని, లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆ పార్టీ గెలిచినా ఉపయోగం ఉండదని, రాష్ట్రంలో ఆ పార్టీ కనుమరుగు అవుతుందని జోస్యం చెప్పారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. మోదీ మరోసారి ప్రధాని అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రస్ అధికారంలోకి వచ్చే అవకాశమేలేదని తేల్చేశారు. రాహుల్ గాంధీ ఎన్నటికీ ప్రధాని కాలేడని కిషన్‌రెడ్డి అన్నారు. ఈమేరకు సోమవారం ఖైరతాబాద్‌లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో ఎక్కడ సంతకం పెట్టుమంటే అక్కడ సంతకాలు చేసే ప్రైమ్ మినిస్టర్ ఉండేవాడని, పదేండ్లుగా సమర్థవంతుడైన నాయకుడు ప్రధానిగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించాడు. ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేకుండా పదేండ్లుగా దేశాన్ని అద్భుతంగా పాలిస్తున్నాడని మోదీకి కిషన్‌రెడ్డి కితాబిచ్చాడు. ప్రజలు దేశం కోసం ఆలోచించి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అసదుద్దీన్ ఓవైసీని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. 

మోదీ గ్యారంటీ: భూపేంద్ర పాటిల్

ప్రధాని మోదీ గ్యారంటీ ఇస్తే తప్పకుండా జరుగుతుందని గుజరాత్ సీఎం భూపేంద్రభాయి పాటిల్ అన్నారు. అలాంటి మోదీని మరోసారి ప్రధానిని చేయాల్సిన అవసరం ఉందన్నారు. మోది గ్యారెంటీ అంటే దేశ ప్రజల గ్యారెంటీ అని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో సమస్యలు తీరాలంటే మరోసారి మోదీ ప్రధాని కావాలన్నారు. సమయ పాలన, అవినీతి రహిత పాలన మోదీ ప్రభుత్వంతో సాధ్యమవుతుందన్నారు.

అసాధ్యాలను మోదీ సుసాధ్యం చేసిండు: లక్ష్మణ్

ఆర్టికల్ 360 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, మహిళలకు 33% రిజర్వేషన్లు, అయోధ్య రామమందిరం వంటి ఎన్నో అసాధ్యాలను సుసాధ్యంచేసిన ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందని ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు. మోదీతో మాత్రమే దేశాభివృద్ధి సాధ్యమనేందుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమేనని చెప్పారు. ఈ పదేండ్లలో జాతీయ రహదారులు, రైల్వే లైన్లు సహా మౌలిక వసతులను అభివృద్ధి చేశారని తెలిపారు. రాష్ట్రాన్ని పదేండ్ల పాటు పాలించిన కేసీఆర్​చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. గతంలో అధికారంలో ఉన్నపుడు కాంగ్రెస్ కూడా చేసిందేమీలేదని, ఇప్పుడు అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని లక్ష్మణ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబం కోసం, బీఆర్ఎస్​ పార్టీ కల్వకుంట్ల ఫ్యామిలీ కోసం పనిచేస్తాయని ఆరోపించారు. బీజేపీ మాత్రమే దేశం కోసం పనిచేస్తుందని, అందుకే బీజేపీకి ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కిషన్ రెడ్డిని గెలిపించి, మోదీని మరోమారు ప్రధానిని చేయాలని ఎంపీ లక్ష్మణ్  కోరారు.