బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల డీఎన్​ఏ ఒక్కటే: కిషన్ రెడ్డి

బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల డీఎన్​ఏ ఒక్కటే: కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం.. హిందూ వ్యతిరేక పార్టీలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆ మూడు పార్టీల డీఎన్​ఏ ఒక్కటేనని విమర్శించారు. ఎంఐఎం తీరుతో పాతబస్తీలో హిందువులు, ముస్లింలు కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. గురువారం నాంపల్లి, చెన్నూరు సెగ్మెంట్లకు చెందిన బీఆర్ఎస్ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరారు. 

బీజేపీ స్టేట్​ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంఐఎం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ కు కొమ్ముకాస్తూ దుశ్శాసన పాత్ర పోషించిందన్నారు. ఆ పార్టీ ఎవరు అధికారంలో ఉంటే వారితో అంటకాగుతుందని, పాతబస్తీలో అభివృద్ధిని అడ్డుకుంటుందని విమర్శించారు. ఎంఐఎంకు రెండు ఎజెండాలుంటాయని ఆయన ఆరోపించారు. ఒకటి తన చీకటి వ్యాపారానికి అండ కోసం సర్కారుతో ఉండడం.. రెండోది బీజేపీని వ్యతిరేకించడమని ఆయన చెప్పారు. 

గతంలో కేసీఆర్.. మజ్లిస్ కాళ్ల వద్ద కూర్చొని దుర్మార్గమైన పాలన సాగించారని, బీఆర్ఎస్ నాయకులు ఎంఐఎం నేతలకు వంగివంగి సలాం కొట్టారని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే.. కేసీఆర్​ను వదిలి కాంగ్రెస్ చెంతకు చేరారన్నారు. మొన్నటి వరకు కేసీఆర్ ఫ్యామిలీ.. ఒవైసీ ఫ్యామిలీగా ఉండేదని, ఇప్పుడు సోనియా ఫ్యామిలీ.. ఒవైసీ ఫ్యామిలీగా మారిందన్నారు. మూసీని లండన్ లో ఉన్న నదిలా మార్చాలని రేవంత్ రెడ్డి అక్బర్​ తో కలిసి వెళ్లి చూసొచ్చారని చెప్పారు. అసదుద్దీన్ ఓడిపోవద్దని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయిందని, తనకు ఇష్టం లేకపోయినా ఆయన్ను గెలిపించేందుకు కృషి చేస్తానని కాంగ్రెస్ నేత 
ఫిరోజ్ ఖాన్ మాట్లాడినట్టు గుర్తుచేశారు.