న్యూఢిల్లీ, వెలుగు: దేశం గ్లోబల్ టెక్నాలజీ శక్తిగా ఎదుగుతున్న తరుణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇంపాక్ట్ సమిట్‌ను అడ్డుకోవడానికి కాంగ్రెస్ శ్రేణులు చేసిన ప్రయత్నాలు వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ వేదికపై దేశం పరువు తీసేలా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చిల్లర చేష్టలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
శుక్రవారం ఢిల్లీలోని తన నివాసంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏఐ సెక్టార్లో భారత సత్తాను ప్రపంచానికి చాటిచెప్పే వేదికగా ఈ ఏఐ సమిట్ నిలిచిందన్నారు. వినూత్న ఆవిష్కరణలు, గిన్నిస్ వరల్డ్ రికార్డులతో దేశ ప్రతిష్ఠ పెరుగుతుంటే.. రాహుల్ గాంధీ కనుసన్నల్లో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన పేరుతో అల్లర్లు సృష్టించారని తీవ్రంగా మండిపడ్డారు.
విదేశాలకు వెళ్లిన ప్రతిసారీ రాహుల్... భారత్ లో ప్రజాస్వామ్యం లేదని, పౌర హక్కులను కాలరాస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తూ దేశ గౌరవాన్ని మంటగలుపుతున్నారని విమర్శించారు. ఏఐ సదస్సు వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేయడం దేశ ఇమేజ్‌కు తీవ్ర భంగం కలిగించిందన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలపడానికి ఎన్నో మార్గాలున్నాయని, కానీ దేశాభివృద్ధిని ప్రతిబింబించే వేదికపై ఇలాంటి రచ్చ చేయడం సిగ్గులేని చర్య అని ఖండించారు.
