
సోమవారం(మే 5) సన్ రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తో జరగబోయే మ్యాచ్ కు ముందు ఒక అద్భుతమైన సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఉప్పల్ వేదికగా జరగబోయే ఈ మ్యాచ్ కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు అతని కుమార్తె శ్రీనికతో మాట్లాడుతూ కనిపించాడు. ఈ వీడియోలో చెప్పులు లేకుండా ఉన్న రాహుల్.. ఢిల్లీ క్యాపిటల్స్ స్లీవ్‌లెస్ ట్రైనింగ్ కిట్‌ను ధరించాడు. ఎమ్మెల్యే, అతని కుమార్తెతో కాసేపు మాట్లాడిన తర్వాత శ్రీనిక ఇచ్చిన టీ-షర్టుపై రాహుల్ తన ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. టీ షర్ట్ పై సంతకం చేసిన తర్వాత తండ్రి-కూతుర్లతో సెల్ఫీ దిగి ఫోటోకు పోజులిచ్చాడు.
ఆ రాజకీయ నాయకుడు కేఎల్ రాహుల్ శిక్షణ కిట్‌కి అభిమాని అని తెలుస్తోంది. రాహుల్ తో మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి తన అనుభవాలను పంచుకున్నాడు. తన ఎక్స్ ఖాతాలో ఇలా రాసుకొచ్చాడు. "కేఎల్ రాహుల్ తో సమయం గడపడం చాలా బాగుంది. నాకు అతని దుస్తుల రంగు చాలా నచ్చింది. పింక్ పర్ఫెక్ట్".అని అయన తెలిపాడు. ఈ సీజన్ లో రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 9 ఇన్నింగ్స్‌ల్లో 53 యావరేజ్..146.06 స్ట్రైక్ రేట్‌తో 371 పరుగులు చేసి ఢిల్లీ జట్టు తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
సొంతగడ్డపై తమ చివరి మ్యాచ్‌ల్లో కోల్‌కతా, ఆర్సీబీ చేతిలో ఓడిపోయిన అక్షర్ పటేల్ సేన ఈ పోరులో తప్పకుండా నెగ్గాలని టార్గెట్‌గా పెట్టుకుంది. అయితే, గత పోరులో గాయపడ్డ కెప్టెన్ అక్షర్ ఆడే విషయంలో అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీ 10 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో 12 పాయింట్లు సాధించి ఐదో ప్లేస్‌లో ఉంది. ప్లేఆఫ్స్ రేసులో ముందంజ వేయాలంటే ఇన్‌ఫామ్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, డుప్లెసిస్, అభిషేక్ పోరెల్ మరింత మెరుగ్గా ఆడాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓడిపోతే ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమిస్తుంది.