KL Rahul: రెండేళ్ల తర్వాత రాహుల్‌కు టీమిండియా పగ్గాలు.. కేఎల్ కెప్టెన్సీ రికార్డ్ ఎలా ఉందంటే..?

KL Rahul: రెండేళ్ల తర్వాత రాహుల్‌కు టీమిండియా పగ్గాలు.. కేఎల్ కెప్టెన్సీ రికార్డ్ ఎలా ఉందంటే..?

సౌతాఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్ కు వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ను టీమిండియా కెప్టెన్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. నవంబర్ 30 నుంచి జరగబోయే వన్డే సిరీస్ కు రెగ్యులర్ కెప్టెన్ శుభమాన్ గిల్.. వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాయాల కారణంగా దూరమయ్యారు. దీంతో అందుబాటులో ఉన్న సీనియర్ ప్లేయర్ రాహుల్ కు సారధ్య బాధ్యతలు అప్పజెప్పారు. రాహుల్ భారత జట్టును ఎలా నడిపిస్తాడో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో భారత వన్డే జట్టును ఈ సీనియర్ ప్లేయర్ విజయవంతంగా లీడ్ చేశాడు. భారత జట్టు కెప్టెన్ గా రాహుల్ కు వన్డేల్లో అద్భుత రికార్డ్ ఉంది. కేఎల్ వన్డే రికార్డ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..        

రాహుల్ కెప్టెన్‌గా తొలి వన్డే సిరీస్ చేదు జ్ఞాపకంగా మిగిలింది. 2022లో సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను ఇండియా 0-3 తేడాతో కోల్పోయింది. అయితే ఆ తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్ లో రాహుల్ కెప్టెన్సీ చేసిన 9 మ్యాచ్ ల్లో భారత జట్టు ఏకంగా 8 మ్యాచ్ ల్లో విజయం సాధించింది.  ఓవరాల్ గా కేఎల్ 12 వన్డేల్లో ఇండియాకు కెప్టెన్సీ చేశాడు. వీటిలో ఇండియా 8 మ్యాచ్ ల్లో గెలిచి 4 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. రాహుల్ విజయాలు శాతం 66.66 గా ఉంది. చివరిసారిగా కేఎల్ డిసెంబర్ 2023లో సౌతాఫ్రికా టూర్ లో కెప్టెన్సీ చేశాడు. సఫారీలపై మూడు వన్డేల సిరీస్ ను ఇండియా 2-1 తేడాతో గెలుచుకోవడం విశేషం. 

కెప్టెన్ గా ఆడినప్పుడు రాహుల్ బ్యాటింగ్ లో కూడా రాణించాడు. బ్యాటర్ గా 10 ఇన్నింగ్స్‌లలో 302 పరుగులు చేశాడు. యావరేజ్ 33.55 ఉంది. వీటిలో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20లలో రాహుల్ ఒకే ఒక్క మ్యాచ్‌లో ఇండియాకు కెప్టెన్సీ చేయగా ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై  టీమిండియా విజయం సాధించింది. టెస్టుల్లో కూడా రాహుల్ రికార్డ్ అద్భుతంగా ఉంది. మూడు మ్యాచ్ ల్లో రెండు విజయాలు సాధించిన ఇండియా ఒక మ్యాచ్ లో ఓడిపోయింది. ఐపీఎల్ విషయానికి వస్తే కెప్టెన్ గా 64 మ్యాచ్‌లలో 31 మ్యాచ్ ల్లో విజయం సాధించి మరో 31 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. ఫార్మాట్ ఏదైనా సరే రాహుల్ విజయాల శాతం 50 కంటే తక్కువగా లేకపోవడం విశేషం. 

సౌతాఫ్రికాతో మూడు వన్డేలకు భారత జట్టు:

రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ , నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ కృష్ణ, అర్షదీప్ సింగ్, ధృవ్ జురెల్