దేశంలోని ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకింగ్ సంస్థల్లోని ఉద్యోగులు జనవరి 27న సమ్మేకు దిగారు. తమకు వారానికి పని దినాలను 5కు దగ్గించాలని.. ప్రస్తుతం ఉన్న వారానికి 6 రోజుల వర్క్ వద్దంటూ డిమాండ్ చేస్తున్నారు. చాలా కాలం నుంచి బ్యాంక్ యూనియన్లు కేంద్ర ప్రభుత్వాన్ని ఇదే విషయం డిమాండ్ చేస్తున్నాయి. రిజర్వు బ్యాంక్, ఎల్ఐసి, స్టాక్ మార్కెట్లు, ప్రభుత్వ ఆఫీసులు కూడా వారానికి 5 రోజులే పనిచేస్తున్నాయని తమకూ అదే వెసులుబాటును అందించాలని వారు కోరుతున్నారు.
ఇప్పటికే బ్యాంక్ యూనియన్లు ఉన్నత స్థాయి అధికారులతో దీనిపై జరిపిన చర్చలు విఫలం కావటంతోనే బంద్ నిర్ణయం తీసుకున్నట్లు వారు చెబుతున్నారు. సమ్మే నోటీసు ఇచ్చిన తర్వాత బుధవారం, గురువారం చర్చలకు లేబర్ కమిషన్ ఉన్నతాధికారులు పిలుపునిచ్చారు. దీంతో సమస్య పరిష్కారానికి చర్చలు ఫలవంతం కాలేదని యూనియన్ సభ్యులు చెబుతున్నారు. తమ సమస్యలపై కేంద్రం సానుకూలంగా స్పందించటం లేదని ఈ నెల ప్రారంభంలో కూడా వారు వెల్లడించారు.
అసలు వారానికి 5 రోజుల పని డిమాండ్ దేనికి..
దేశంలో డిజిటలైజేషన్ పెరిగటంతో బ్యాంకులపై ఒత్తిడి తగ్గిన మాట చాలా వరకూ వాస్తవమే. అయితే తమకు బ్యాంకింగ్ సంస్థలు ఇస్తున్న టార్గెట్లు అధిక ఒత్తిడిని కలిగిస్తున్నాయని.. అందుకే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసం తమకు కూడా వారానికి రెండు రోజులు సెలవు కావాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనివల్ల కస్టమర్లకు ఎలాంటి అసౌకర్యం ఉండబోదని.. పనిలో అంతరాయాలు రావని వారు అంటున్నారు. ఇందుకోసం తాము రోజూ ప్రస్తుతం ఉన్న పని గంటల కంటే అదనంగా 40 నిమిషాలు సోమవారం నుంచి శుక్రవారం వరకూ పనిచేస్తామంటూ బ్యాంక్ యూనియన్లు ఆఫర్ చేస్తున్నాయి.
