- అక్టోబర్ 14 సాయంత్రం 5 గంటల వరకు గడువు
- 56 ఖాళీ సీట్లతో వేకెన్సీ మ్యాట్రిక్స్ విడుదల చేసిన కాళోజీ వర్సిటీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు అన్-ఎయిడెడ్ నాన్-మైనారిటీ, మైనారిటీ మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ ఖాళీ సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ వర్సిటీ మాప్‌అప్ కౌన్సెలింగ్ ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు బుధవారం సాయంత్రం 5 గంటల వరకు https://tsmedadm.tsche.in/ వెబ్‌సైట్లో ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. ఫస్ట్ ఫేజ్‌లో ఆప్షన్లు ఇవ్వని వారు, గత విడతల్లో సీట్లు వచ్చి చేరని వారు, ఎంసీసీ మూడో రౌండ్ వరకు ప్రవేశాలు పొందిన వారు ఈ కౌన్సెలింగ్‌కు అనర్హులు.
ఇప్పటికే కాలేజీల్లో చేరి చదువుతున్న వారు స్లైడింగ్‌కు ఆప్షన్లు ఇవ్వొచ్చు. టీఆర్ఆర్, మెడిసిటీ కాలేజీల్లో పెరిగిన సీట్లలో సగం కన్వీనర్ కోటాకు కేటాయించారు. సీటు అలాట్ అయిన వారు రూ.12 వేల వర్సిటీ ఫీజు చెల్లించి అలాట్‌మెంట్ ఆర్డర్ పొందాలని, గతంలో ఫీజు చెల్లించిన వారు మళ్లీ కట్టాల్సిన అవసరం లేదని వర్సిటీ పేర్కొంది
56 సీట్లతో మ్యాట్రిక్స్..
గాంధీ, ఉస్మానియా, కాకతీయతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ మెడికల్ కాలేజీల్లో కేటగిరీల వారీగా ఖాళీ సీట్ల వివరాలను వర్సిటీ విడుదల చేసింది. గత విడతలో సీట్లు వచ్చినా చేరని వారు, ఫ్రీ ఎగ్జిట్ ద్వారా వదులుకున్న 56 సీట్లను కూడా మాప్‌అప్ పూల్‌లో చేర్చింది. ఇందులో గాంధీ మెడికల్ కాలేజీలో అత్యధికంగా 12 సీట్లు ఖాళీగా ఉన్నాయి. స్లైడింగ్‌తో మరిన్ని సీట్లు ఖాళీ అయ్యే అవకాశం ఉండటంతో, అభ్యర్థులు తమ ప్రాధాన్యత ప్రకారం ఎన్ని కాలేజీలకైనా ఆప్షన్లు ఇవ్వొచ్చని అధికారులు సూచించారు.
సీటు వదిలేస్తే రూ.20 లక్షల ఫైన్.. మూడేండ్లు డిబార్
మాప్‌అప్‌లో సీటు అలాట్ అయ్యాక చేరకపోయినా, చేరిన తర్వాత మధ్యలో వదిలేసినా రూ.20 లక్షల జరిమానాతో పాటు మూడేండ్ల పాటు వర్సిటీ పరిధిలో ఎంబీబీఎస్ ప్రవేశాలపై డిబార్ చేస్తామని కాళోజీ వర్సిటీ హెచ్చరించింది. జరిమానా చెల్లించిన తర్వాతే ఒరిజినల్ సర్టిఫికెట్లు తిరిగి ఇస్తామని స్పష్టం చేసింది.
స్లైడింగ్‌లో కొత్త సీటు వస్తే పాత సీటు ఆటోమేటిక్‌గా రద్దవుతుందని తెలిపింది. చేరే ఉద్దేశం ఉన్న కాలేజీలకే ఆప్షన్లు ఇవ్వాలని సూచించింది. సందేహాలు, టెక్నికల్సమస్యల పరిష్కారానికి 9392685856, 7842136688 నంబర్లను సంప్రదించవచ్చని వర్సిటీ సూచించింది.
