- నోటిఫికేషన్ రిలీజ్
- నేటి నుంచి 18వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2025–-26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ కోర్సుల్లో స్టేట్ కోటా (కాంపిటెంట్ అథారిటీ కోటా) కింద అడ్మిషన్ల కోసం ఫస్ట్ రౌండ్ వెబ్ కౌన్సెలింగ్ కు కాళోజీ హెల్త్ వర్సిటీ (కేఎన్ఆర్యూహెచ్ఎస్) సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 18 రాత్రి 11:30 గంటల వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు అవకాశం కల్పించింది. ఈ కౌన్సెలింగ్ ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ, పీఎంసీ, సీఏపీ కేటగిరీలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ మైనారిటీ, నాన్ -మైనారిటీ మెడికల్ కాలేజీలకు వర్తిస్తుంది. నీట్ యూజీ 2025లో క్వాలిఫై అయి, యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో సోమవారం ప్రకటించిన ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో ఉన్న అభ్యర్థులు.. https://tsmedadm.tsche.in/ ద్వారా వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు.
కరీంనగర్‌లోని చల్మెడ ఆనంద్ రావు మెడికల్ కాలేజీ అడ్మిషన్లు తెలంగాణ హైకోర్టు ఆర్డర్లకు లోబడి ఉంటాయని యూనివర్సిటీ స్పష్టం చేసింది. వెబ్ ఆప్షన్లు ఎంచుకోకపోతే, అలాట్ అయిన కాలేజీలో జాయిన్ కాకపోతే, సెకండ్, థర్డ్, స్ట్రే వెకెన్సీ రౌండ్ కౌన్సెలింగ్‌లకు అభ్యర్థులు అర్హులు కాదని యూనివర్సిటీ వెల్లడించింది. అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి రూ. 12వేల యూనివర్సిటీ ఫీజును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి. స్పెసిఫైడ్ డేట్‌కు ముందు కాలేజీ ప్రిన్సిపల్‌కు ఒరిజినల్ సర్టిఫికెట్లు, బాండ్లు సమర్పించి, ట్యూషన్ ఫీ చెల్లించాలని యూనివర్సిటీ తన నోటిఫికేషన్ లో తెలిపింది. ఫైనల్ వెరిఫికేషన్ కాలేజీలో జరుగుతుందని, యూనివర్సిటీ ఫీజు రిఫండ్ కాదని స్పష్టం చేసింది
ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల...
ఎంబీబీఎస్ అడ్మిషన్లకు సంబంధించి కాళోజీ హెల్త్ వర్సిటీ సోమవారం ఫైనల్ మెరిట్ లిస్ట్ ను విడుదల చేసింది. గత శుక్రవారం ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేసిన వర్సిటీ, అభ్యంతరాలు స్వీకరించిన తరువాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ను రిలీజ్ చేసింది.ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో ఉంటే మాత్రమే వెబ్ ఆప్షన్ల ఎంపికకు అర్హులని వర్సిటీ స్పష్టంచేసింది. సీట్ మ్యాట్రిక్స్ వివరాలు http://knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.
