- మంత్రి పొన్నంకు కోదండరాం, దయాకర్ విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను టీజేఎస్ చీఫ్ కోదండరాం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కోరారు. గురువారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నంతో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. జిల్లాలవారీగా ఉద్యమకారులను గుర్తించాలని , ఇందుకు అధికారులు, ఉద్యమ నేపథ్యం ఉన్నవారితో కమిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ఉద్యమకారులకు హామీల అమలు, విధివిధానాలు, అర్హుల ఎంపిక తదితర అంశాలపై నేతలు చర్చించారు. సీఎం దగ్గర ఈ అంశాన్ని ప్రస్తావించాలని, త్వరగా కమిటీ ఏర్పాటు చేసేలా చొరవ తీసుకోవాలని మంత్రిని కోరారు. వారంలో మరోసారి సమావేశం ఏర్పాటు చేద్దామని నేతలకు మంత్రి హామీ ఇచ్చారు. ఉద్యమకారుల హామీలు, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ అంశంపై కేబినెట్ లో, సీఎం దగ్గర సైతం చర్చ జరిగిందని నేతలకు మంత్రి తెలిపారు.
