‘మిలియన్ మార్చ్’ పోరాట ఫలితమే స్వరాష్ట్రం :  కోదండరాం

‘మిలియన్ మార్చ్’ పోరాట ఫలితమే స్వరాష్ట్రం :  కోదండరాం
  • తెలంగాణ ఒక్కరి వల్ల రాలేదు.. సబ్బండ వర్గాలు కలిస్తేనే సాధ్యమైంది: కోదండరాం
  • మిలియన్ మార్చ్ డే సందర్భంగా గన్ పార్క్ వద్ద నివాళులు 

బషీర్​బాగ్, వెలుగు: ‘మిలియన్ మార్చ్’ పోరాట ఫలితంగానే స్వరాష్ట్రం సిద్ధించిందని, ఏ ఒక్కరి వల్లనో రాలేదని, సబ్బండ వర్గాలు కలిసి పోరాడితేనే సాధ్యమైందని ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. మంగళవారం ‘మిలియన్ మార్చ్ డే’ సందర్భంగా హైదరాబాద్‌‌‌‌లోని గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నేతలు, వివిధ జిల్లాల ఉద్యమకారులతో కలిసి ఆయన  నివాళులర్పించారు.  

ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ 2011 మార్చి 10న జరిగిన మిలియన్ మార్చ్ తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక కీలక మలుపు అని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో మిలియన్ మార్చ్‌‌‌‌ను అడ్డుకునేందుకు పాలక వర్గాలు అనేక కుట్రలు చేశాయని, సుమారు 50 వేల మంది విద్యార్థులను అరెస్టు చేశారని తెలిపారు.  ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్నిసార్లు వాయిదా పడినా ఉద్యమకారులు వెనకడుగు వేయకుండా ట్యాంక్ బండ్ పైకి కదం తొక్కి మిలియన్ మార్చ్‌‌‌‌ను విజయవంతం చేశారని కొనియాడారు.

వచ్చే ఏడాది నాటికి ఉద్యమకారుల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను న్యాయం జరిగేలా కృషి చేస్తోందన్నారు. కవి అందెశ్రీ రచించిన ‘‘జయ జయహే తెలంగాణ’’ను రాష్ట్ర గేయంగా ప్రకటించడం, ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో అవార్డులను ప్రభుత్వం ఇస్తుందన్నారు.

సెక్రటేరియెట్‌‌లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించడం ఉద్యమకారులపై ఉన్న గౌరవానికి నిదర్శనమన్నారు. ఈజిప్ట్ ప్రజా ఉద్యమ స్ఫూర్తితోనే అప్పట్లో మిలియన్ మార్చ్‌‌‌‌ను నిర్వహించామని, ఒక ఉద్యమకారుడి బిడ్డగా వారి సమస్యల పరిష్కారం కోసం మండలిలో గళం విప్పుతానని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో మిలియన్ మార్చ్ ఒక టర్నింగ్ పాయింట్‌‌‌‌గా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.