కోల్‌కతా: బెంగాల్‌లోని కోల్‌కతా మెట్రో రైల్వే వ్యవస్థను పూర్తిగా ఆధునికీకరించనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రాబోయే ఐదేండ్లలో 60 నెక్స్ట్ జనరేషన్ రైళ్లను ప్రవేశపెట్టబోతున్నట్లు చెప్పారు. శనివారం ఆయన కోల్‌కతా మెట్రోలో ప్రయాణించి, ప్యాసింజర్లతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ.. బెంగాల్‌లోని డబుల్ ఇంజన్ ప్రభుత్వంతో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులన్నీ వేగంగా పరుగులు పెడతాయన్నారు.
గత 42 ఏండ్లలో కోల్‌కతా మెట్రో నెట్‌వర్క్ కేవలం 28 కిలోమీటర్లు మాత్రమే పూర్తయిందని, కానీ 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత రికార్డు స్థాయిలో 45 కిలోమీటర్ల కొత్త మెట్రో లైన్లను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. ప్రయాణికులకు అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అయితే, గతంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేకపోవడంతో అనేక కీలక ప్రాజెక్టులు ఆలస్యమయ్యాయని ఆరోపించారు.
