కడియం పెద్ద మోసగాడు .. తాటికొండ రాజయ్యను చీట్ చేసిండు : రాజగోపాల్​రెడ్డి

కడియం పెద్ద మోసగాడు ..  తాటికొండ రాజయ్యను చీట్ చేసిండు : రాజగోపాల్​రెడ్డి
  •     మంత్రి పదవులపై ఎమ్మెల్యేల్ని రెచ్చగొట్టి కాంగ్రెస్​ను చీల్చే కుట్ర చేస్తుండు
  •     ఓడిపోయినా కేటీఆర్​కు అహంకారం తగ్గలే
  •     మంత్రి పొన్నం‌ను అవమానించేలా మాట్లాడుతున్నరు
  •     ఇచ్చిన అన్ని హామీలు తప్పకుండా నెరవేరుస్తమని ప్రకటన
  •     గత ప్రభుత్వ వైఫల్యాలు చెప్తుంటే తట్టుకోలేకపోతున్నరని ఎద్దేవా
  •     రాజగోపాల్ మాట్లాడుతుండగానే బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్

హైదరాబాద్, వెలుగు :  బీఆర్ఎస్ సభ్యుడు, స్టేషన్​ఘన్​పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఓ పెద్ద మోసగాడని, తాటికొండ రాజయ్యను చీట్ చేసిండని కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి ఫైర్​అయ్యారు. మంత్రి పదవులపై కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి పార్టీని చీల్చే కుట్ర చేస్తున్నడని ఆరోపించారు. బుధవారం బడ్జెట్​పై చర్చ సందర్భంగా కడియం శ్రీహరి తనపై వ్యక్తిగత విమర్శలు చేయడంతో ఆయపై రాజగోపాల్​మండిపడ్డారు. ‘‘మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి అనేది మా పార్టీ అంతర్గత విషయం. మంత్రి పదవి రాదు అంటూ తనను పదే పదే రెచ్చగొట్టేందుకు కడియం శ్రీహరి సహా బీఆర్‌‌ఎస్ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. నాతో పాటు, మిగిలిన ఎమ్మెల్యేల వద్దకు కూడా వెళ్లి ఇదే విధంగా రెచ్చగొట్టి, పార్టీని చీల్చే కుట్ర చేస్తున్నారు. ఆ కుట్రలు నెరవేరవు, నేను పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదు. మునుగోడు ఎమ్మెల్యే పదవిని గడ్డిపోచలాగ తీసేసి, బీఆర్‌‌ఎస్ ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల కాళ్ల దగ్గర తీసుకొచ్చాను. నువ్వేం చేశావ్​? కనీసం ఒక్క రోజు కూడా తెలంగాణకు అనుకూలంగా మాట్లాడలేదు. ఉద్యమ కారుడు తాటికొండ రాజయ్య మిమ్మల్ని నమ్ముకుని టీఆర్‌‌ఎస్ పార్టీలోకి వస్తే ఓసారి మంత్రి పదవి నుంచి తొలగించి అవమానించిన్రు. ఇంకోసారి టికెట్ ఇవ్వకుండా అవమానించిన్రు. ఇలా రెండుసార్లు ఆయనను చీట్ చేసినవ్‌. నాకు మంత్రి పదవి వస్తదో లేదో గానీ, నీకైతే బీఆర్‌‌ఎస్‌లో ఉంటే జన్మలో మంత్రి పదవి రాదు” అని రాజగోపాల్‌ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలనూ తమ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. 

మంత్రి మాట్లాడుతుంటే కుర్చో మంటరా..

ప్రజలు అధికారంలో నుంచి దింపేసినా మాజీ మంత్రి కేటీఆర్‌‌కు, బీఆర్ఎస్ పార్టీకి అహంకారం తగ్గలేదని రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతుంటే ఆయనను అవమానించేలా కేటీఆర్‌‌, బీఆర్‌‌ఎస్ సభ్యులు రన్నింగ్ కామెంట్రీ చేస్తున్నారని, కూర్చో.. కూర్చో.. అంటూ ఎగతాళి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వారికి అంత అహంకారం ఏంటని.. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించారో ఇప్పుడూ అలాగే చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతుంటే సభలో ఉన్న బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేక పోతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్‌‌ కుటుంబం.. ఈ పదేండ్లలో రూ.లక్షల కోట్లు దోచుకుందని ఆరోపించారు. మాట్లాడుతుండగానే బీఆర్‌‌ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేయగా, సమాధానం చెప్పలేక సభ నుంచి పారిపోతున్నారని రాజగోపాల్ ఎద్దేవా చేశారు.