రాహుల్‌ గాంధీతో రాజగోపాల్ రెడ్డి భేటీ

రాహుల్‌ గాంధీతో రాజగోపాల్ రెడ్డి భేటీ

న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా  వెల్లడించారు. ‘‘ఢిల్లీలో మా నాయకుడు రాహుల్ గాంధీని కలిశాను”అని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కేబినెట్‌లో తనకు అవకాశం కల్పించాలని రాహుల్ గాంధీని రాజగోపాల్ రెడ్డి కోరినట్లు తెలిసింది.

ముఖ్యంగా ఎన్నికల సమయంలో తనకు మంత్రి పదవి ఇస్తానన్న కాంగ్రెస్ హైకమాండ్ హామీని ఆయన మరోసారి గుర్తు చేసినట్లు సమాచారం. అలాగే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరాలు, ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర రాజకీయాలపై రాహుల్ గాంధీతో చర్చించినట్లుగా తెలుస్తుంది. కాగా... గత విస్తరణలో మంత్రి పదవి ఇవ్వకపోవడంపై రాజగోపాల్ రెడ్డి పలుమార్లు తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు.