జనవరి 18 నుంచి మార్చి 16 వరకు కొనసాగనున్న జాతర
- స్వామి కల్యాణం, జాతర వైభవంగా నిర్వహించాలి
- దేవాదాయ శాఖ అధికారులకు మంత్రి కొండా సురేఖ దిశానిర్దేశం
- మల్లన్న జాతర, కల్యాణం పోస్టర్ ఆవిష్కరణ
హైదరాబాద్, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి కల్యాణం, జాతరను వైభవంగా నిర్వహించాలని మంత్రి కొండా సురేఖ దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. వచ్చే నెల 14 ఉదయం 10.45 గంటలకు మల్లికార్జున స్వామి వారి కల్యాణాన్ని, జనవరి 18 నుంచి 10 వారాలపాటు మార్చి 16 వరకు జాతర కొనసాగనున్నదని మంత్రి పేర్కొన్నారు.
గతేడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కోరారు. సోమవారం సెక్రటేరియెట్‌లో తన చాంబర్‌లోని కాన్ఫరెన్స్ హాల్ లో సిద్దిపేట జిల్లా అధికారులతో మంత్రి కొండా సురేఖ.. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్సెక్రటరీ శైలజారామయ్యర్, డైరెక్టర్ హరీశ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
తొలుత మల్లన్న జాతర, కల్యాణం పోస్టర్ నుఆవిష్కరించారు. కొమురవెల్లి ఆలయంలో అభివృద్ధి పనులు, అమ్మవార్లు బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మకు కిరీటాల తయారీ పనులపై మంత్రి సురేఖ వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొమురవెల్లి మల్లన్న కల్యాణం, జాతరకు లక్షలాది మంది భక్తులు తరలొస్తారని, అన్ని సదుపాయాలు కల్పించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
భక్తుల క్యూలైన్లు, బారీకేడ్లు, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా, వీవీఐపీలకు ప్రత్యేక దర్శనంతోపాటు, భక్తులకు దారులను తెలిపేలా సైన్ బోర్డులు, తాగునీరు, మెడికల్ క్యాంపు, లాక్టేషన్ గదులు తదితర ఏర్పాట్లు చేయాలని అదేశించారు. జాతర సమయానికి వేసవి కాలం రానుండటంతో భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, నడిచే మార్గాల్లో మ్యాట్లు, వృద్ధులు, వికలాంగులు, గర్భిణులకు బ్యాటరీ వాహనాలు అందుబాటులో ఉంచాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను సంపూర్ణంగా నిషేధించాలన్నారు.
మల్లికార్జున స్వామివారి కల్యాణం, జాతర ను విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్లేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. జాతరన్నీ రోజులు సాయంత్ర వేళల్లో కళా బృందాలతో ఒగ్గుకథతోపాటు జానపద కళారూపాలను ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కల్యాణోత్సవానికి వారంరోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
జనవరి 18న మొదటి ఆదివారం
జనవరి 18న మొదటి ఆదివారం, 25న రెండు, ఫిబ్రవరి 1న మూడు, 8న నాలుగు, 15న ఐదు (అదే రోజు మహాశివరాత్రి), 22న ఆరు, మార్చి 1న ఏడు, 8న ఎనిమిది, 15న తొమ్మిది ఆదివారాలు జాతర కొనసాగనున్నది. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి, సిద్ధిపేట కలెక్టర్ హైమావతి, కొమురవెల్లి ఆలయ ఈవో వెంకటేశ్, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
