- తరుచూ వాయిదానే..
- ఈ నెల10న ప్రధాని ప్రారంభిస్తారనే ఆశలు
సిద్దిపేట/కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. గత ఏడాది దసరాకు ప్రారంభిస్తామని ఆగస్టులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించినా స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ నేపథ్యంలో రెండుసార్లు వాయిదా పడింది. ఆరు నెలల కింద స్టేషన్ పనులన్నీ పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రారంభోత్సవంపై స్పష్టత రావడం లేదు. ప్రతి ఏటా కొమురవెల్లి మల్లన్న ధర్శనానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి 25 లక్షల మంది వస్తుంటారు. హైదరాబాద్, సికింద్రాబాద్ తో పాటు ఛత్తీస్గఢ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు స్టేషన్ ప్రారంభంతో బాధలు తప్పనున్నాయి.
మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి వరకు 151 కిలోమీటర్ల రైల్వే లైన్ లో భాగంగా కొమురవెల్లిలో రైల్వే స్టేషన్ ను నిర్మించారు. రాజీవ్ రహదారి కొండపాక గేట్ నుంచి రెండు కిలో మీటర్ల దూరంలోని రైల్వే అండర్ పాస్ సమీపంలో మూడేండ్ల కింద పనులు ప్రారంభించారు. కొమురవెల్లిలో రైల్వే స్టేషన్ ప్రారంభమైతే హైదరాబాద్ నుంచి వచ్చే భక్తుల ఇబ్బందులు తొలిగిపోతాయి.
వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని!
ఈ నెల 10న ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనలో భాగంగా వర్చువల్ గా మల్లన్న రైల్వే స్టేషన్ ను ప్రారంభిస్తారనే ప్రచారం జరుగుతోంది. స్టేషన్ ను వెంటనే ప్రారంభించాలని భక్తులు, స్థానికులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో నిర్వహించే కార్యక్రమంలో స్టేషన్ ను వర్చువల్ గా ప్రారంభిస్తారని రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
